13-11-2025 12:00:00 AM
డాక్టర్ సంగని మల్లేశ్వర్ :
తెలంగాణ సాహిత్య శిఖరం అందె శ్రీ కానరాని లోకానికి వెళ్లడం జీర్ణించుకోలేక పోరుగడ్డ చిన్నబోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజా వాగ్గేయకారుడు, దళిత కవి, అందెశ్రీ రాసిన పాట, తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చి ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అంటూ తెలంగాణ వేనోళ్ళ పొగిడి, జంగ్ సైరన్ మోగించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా దద్దరిల్లేలా చేసిన అందెశ్రీ కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రం లో మునిగిపోయారు.
నాడు పాటకు జరిగిన అవమానాన్ని దిగమింగి ఒక్కడు లెక్క లు వేసుకుంటే వచ్చేదా నా తెలంగాణ.. ‘బుడి, బుడి అడుగులు వేసిన చిన్నారి నుంచి కాటికి కాళ్లు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ’.. ‘ఏ ఒక్కడిదో కాదు తెలంగాణ అందరిదీ’ అంటూ గద్గద స్వరంతో గర్జించిన అందెశ్రీ మానవ నాగరికతకు అద్దం పట్టిన గీతం ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ తన సిరాచుక్క తో బంధించిన అందెశ్రీ సబ్బండ కులాలు, వర్గాలు, సకల జనులు సమైక్యంగా పోరాడేందుకు అయన గళ గర్జన సమహోన్నత పోరాటానికి సిద్ధం చేసింది.
లోతుగా విశ్లేషిస్తే సమస్త తెలంగాణ ఉద్యమం.. ఒక గద్దర్, ఒక అందెశ్రీ, గూడ అంజయ్య లాంటి ఎందరో దళిత బహుజనుల గుం డెల్లో నుంచి వచ్చిన సాంస్కృతిక సాహిత్య విప్లవంగా కనిపిస్తది. మాటల తూటాలను పాటలుగా చేసుకొని, ఆటలను కలగలిపి ఒక గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన దాఖలాలు బహుశా ప్రపంచ చరిత్రలోనే లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే పేదోళ్ల ఆట, పాట, మాట కలబోసి ఆత్మగౌరవ పోరాటమైతే కానీ తెలంగాణ రాష్ర్టం కల సాకారామైందని చెప్పొచ్చు.
పాటలే రామ బాణాల్లా..
నాడు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాత రం’ పాట ఆయుధంగా మారి, బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి విముక్తి ఏవిధంగా ప్రసాదించిందో, అదే మాదిరిగా, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వాగ్గేయకారుడు, దళిత కవి, అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది, తెలంగాణ ఆత్మ గౌర వానికి పట్టం కట్టి, వలసపాలకుల నుంచి విముక్తి కలిగించింది.
ఈ పవిత్రమైన పాటను రాష్ర్ట గీతంగా అమలు చేద్దామని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చెప్పిన మాటలను నమ్మి, పల్లె పల్లెల్లో, బడి పిల్ల లు, ప్రభుత్వ కార్యాలయాల్లో సకల జనులంతా జాతీయ గీతంతో సమానంగా పా డుకున్నారు. సకలజనులు సైతం అదే స్ఫూర్తిగా ముందుకు కదిలి రాష్ర్టం సాధించుకున్నరు. కానీ తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీతాన్ని మరుగున పెట్టిండ్రు. దానికి కారణం లేకపోలేదు.
కేవలం బీఆర్‌ఎస్ పది కాలాల పాటు పతాక శీర్షికలో ఉండే విధంగా, జయ జయహే గీతంలో మార్పులు, చేర్పులు, కూర్పులు చేయాలన్న కేసీఆర్ కోరికను అందెశ్రీ తిరస్కరించడంతో.. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకున్నారని, స్వయంగా విద్యానగర్ మెస్‌లో భోజనం చేస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు మర్చిపోలేను. దేశం గర్వించే తెలంగాణ గేయాన్ని, జనం గుండెల్లో గూడు కట్టుకున్న పాటనే పాతరేసిండ్రని తెలంగాణ యావత్తు కోడై కూసింది.
గొప్ప సాహిత్య ప్రియుడనని తరుచూ చెప్పుకునే కేసీఆర్ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు గద్దర్, అందెశ్రీ లాంటి ఉద్యమ కవులను ఆహ్వనించకుండా అవమానపరిచిన సంగతి ఎవరు మరువరు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటాల్లో రామ బాణాల్లా పని చేసిన పాటలు బీఆర్‌ఎస్ పార్టీకి గుచ్చుకున్నందుకే ఇవాళ రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్న మాట నిజమే కదా!
సాహిత్యానికి చిహ్నంలా..
బుడి బుడి అడుగులతో కడుపునిండా బువ్వలేక, చిరిగిన లాగుతో బర్లను మేపు తూ, పాదాలను పేర్చి పాట పాడుతుంటే ఎగతాళి చేసిన సోపాతోళ్లను అందెశ్రీ ఏనాడు ఈసడించుకోలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను జానపద పాటల రూ పంలో పదునైన ఆయుధాలుగా మార్చి పాలకుల గుండెల్లో గుచ్చుకునేలా చేసినా, తెలంగాణ సాహిత్యానికి ఉద్యమ చిహ్నాలుగా తగిన గుర్తింపు, గౌరవం గత ప్రభు త్వం ఇవ్వకపోవడం శోచనీయం.
తెలంగాణ ఉద్యమానికి ‘తెలంగాణా తల్లి’ అస్తిత్వ రూపమిస్తే, పాటలే జీవ నాడులయిన పాటలను, వాటిని రాసిన కవులను నామ రూపాల్లేకుండా చేయాలనుకోవడం బ్ర హ్మదేవుడి తరం కూడా కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందెశ్రీ అన్నట్లు.. ‘సమస్త తెలంగాణ నమ్మినందుకు ఐదేళ్లు ఏలుతారేమో, కాదంటే పదేండ్లు ఉంటారేమో.. కానీ తెలంగాణ ఇవ్వని జాగీరు కాదు కదా?’ అన్న ఆయన మాటల వెనుక అర్థం ఫలితాలు వస్తేగాని బీఆర్‌ఎస్‌కు తెలియలేదు.
నిజంగానే తెలంగాణ ఏర్పాటు తరువాత, ఉద్యమ సాహిత్యం పట్ల నాటి పాలకుల అనుచిత వైఖరి అందెశ్రీ ని బాధపెట్టింది. ఎందరో దళిత బహుజన కవులు తెలంగాణ భాష, యాస, సంస్కృతి ప్రతిబింబించేలా పోరాట పటిమతో సామాజి క సమస్యలను, అణచివేతను ఎత్తిచూపుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చి నా కులం మిళితం కాలేదు.
కానీ ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దళిత గిరిజన బహుజన కవులను, మేధావులకు సరైన గుర్తింపు దొరకలేదని తెలంగాణ తల్లి తల్లడిల్లింది. అయినా పాలకుల వైఖరి కొత్తకాదు కదా? ఓడ ఎక్కే వరకు ఓడ మల్ల య్య, ఒడ్డు దిగగానే బోడ మల్లయ్య అన్న సామెత వట్టిగా రాలేదు కదా?
ధిక్కారమే శ్వాసగా..
అయితే బీఆర్‌ఎస్ పాలన తర్వా త అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం, దళిత, బహుజనులకు పెద్దపీట వేసింది. దళిత బహుజన ఉద్యమ కవుల రచనలను, అమరుల ఆత్మత్యాగాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చే ప్రయత్నం చేసింది. ఉద్యమ సాహిత్యాన్ని, తెలంగాణ నుంచి వేరు చేయడమంటే ‘తల్లి’నుంచి పిల్లను వేరుచేయడం లాంటిదే’నన్న నగ్నసత్యా న్ని రేవంత్ సర్కార్ గ్రహించింది.
దీంతో తెలంగాణ జాతిని ఆత్మ న్యూనతాభావం నుంచి తల ఎత్తుకుని ఆత్మ గౌరవంతో నిలబడి వలస పాలకులతో కలబడేందుకు బలాన్నిచ్చిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ర్ట గీతంగా ప్రకటించి అందరి మన్ననలు పొందారు. స్వచ్ఛమైన సంస్కృతులకు నెలవైన తెలంగాణ మాగాణంలో, తెలంగాణ భాషా వికాసంలో వెలుగులు పంచిన వారికి సమున్నత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ సఫలమైంది.
నంది అవా ర్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇచ్చి వారి ఋణం తీర్చుకున్నది. చదువు ఉం టేనే బాషా వస్తుందని నమ్మిన ఈ రోజు ల్లో తన మెదడుకు పదనుపెట్టి, ఆ పుట్ట నుంచి పాటను ప్రజల్లోకి వదిలి, తాను లేకుండా జీవితాం తం గుర్తుపెట్టుకొని జీవిస్తారు అనుకోలేదు.
ధిక్కారమే ధ్యాస గా.. మానవత్వమే శ్వాసగా తెలంగాణ అస్తి త్వ పోరాటానికి, ఆత్మగౌరవానికి అయన జానపద గేయాలు, దళిత బహుజన కవి త్వం, సాహి త్యం ప్రాణం పోశాయన్నది అక్షర సత్యం. నాలు గు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రకృతి ఊట అందెశ్రీ. ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసి తెలంగాణ సాధించారు కానీ, ‘మేమెంతో.. మా కంతా నినాదం’ ఊపందుకునే తరుణంలో అందెశ్రీ లోకాన్ని విడవడంబీసీ ఉద్యమానికి తీరని లోటు.