బీసీ విద్యకు భరోసా ఏదీ!
సంగని మల్లేశ్వర్ :
తెలంగాణ(Telangana)లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు(Fee reimbursement arrears) వేల కోట్ల రూపాయలకు చేరడం ఆందోళన కలిగించే అంశం. ఈ బకాయిల ప్రభావం కేవలం కళాశాలలపైనే కాదు.. పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్య(Higher Education)పైనా పడుతోంది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికి రూ.5,435.19 కోట్లు పెండింగ్ ఉండగా, ఆ తర్వాత బకాయిలు మరిన్ని పేరుకుపోయాయి. అయితే ఎవరి పాలనలో బకాయిలు పేరుకుపోయాయన్న దానికంటే.. వాటిని ఎలా పరిష్కరిస్తారన్నదే ముఖ్యం.
ఫీజు రీయింబర్స్ మెంట్ బీసీ విద్యార్థులకు కేవలం ఆర్థిక సహాయం కా దు.. వారి భవిష్యత్తుకు సంజీవని. అయితే, ఫీజు బకాయిలు రూ.8,591.62 కోట్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ బకాయిలపై హైకోర్టులో ప్రైవేట్ విద్యా సంస్థలు(Private educational institutions) దాఖలు చేసిన పిటిషన్లు కూడా సమస్య తీవ్రతను వెల్ల డించాయి. బకాయిల చెల్లింపులకు స్ప ష్టమైన కాలపట్టికపై న్యాయస్థా నం ప్రశ్నలు లేవనెత్తింది. అనంతరం ప్రభుత్వం నిర్ధిష్ట కాలవ్యవధిలో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చింది.
అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం కావడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. నకిలీ అడ్మిషన్లు, తప్పుడు హాజరు, నిబంధనలు పాటించని కళాశాలలు, అధిక ఫీజుల వసూళ్లు వంటి అక్రమాలను అరికట్టడం ప్రభుత్వ బాధ్యతే. కానీ అక్రమాలను అరికట్టే క్రమం లో నిజమైన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ జాప్యానికి గురికాకూడదు. కాబట్టి ప్రభుత్వం కళాశాలలను మూడు కేటగిరీలుగా విభజించడం సముచితం.
నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న కళాశాలలకు బకాయిలను ప్రాధాన్యతతో విడుదల చేయాలి. చిన్న పాటి లోపాలున్న సంస్థలకు గడువు ఇచ్చి సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి. నకిలీ అడ్మిషన్లు, తప్పుడు హాజరు, అక్రమ వసూళ్లు వంటి తీవ్రమైన అవకతవకలు నిర్ధారణైన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కళాశాలలకు ఒక్క రూపాయి కూడా వద్దు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను సాంకేతికంగానూ ప్రక్షాళన చేయా లి. విద్యార్థి అర్హత, అడ్మిషన్, హాజరు, పరీక్షల వివరాలు, కళాశాల గుర్తింపు, ఫలితాలు వంటి అంశాలను ఒకే డిజిటల్ వ్యవస్థలో అనుసంధానం చేయాలి. తద్వారా నిజంగా చదువుతున్న విద్యార్థికి నిధులు చేరుతున్నా యా లేదా అన్నది పారదర్శకంగా నిర్ధారించవచ్చు.
2026 నుంచి ప్రభుత్వం డీబీటీ విధానంలో విద్యార్థుల ఖాతాలకు నిధులు బదిలీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త మార్గదర్శకాల్లో రీయింబర్స్‌మెంట్ విడుదలకు కాలపట్టికను కూడా నిర్దేశించింది. ఇది సరైన దిశలో అడుగే అయినప్పటికీ, అమలులో విద్యార్థిపై అదనపు భారం పడకుండా చూడా లి. నాణ్యత లేని సంస్థలకు ప్రజాధనం వెళ్లకుండా అరికట్టాలి.
బీఆర్‌ఎస్ ఇప్పుడు బీసీ విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడటం కంటే, తమ పదేళ్ల పాలనలో బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? కళాశాలలకు ఎందుకు సకాలంలో చెల్లించలేదు? అనే ప్రశ్నలకు కూడా సమాధా నం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నమాదిరిగా బీసీలకు ద్రోహం చేస్తూ బీజేపీ రూ.15వేల కోట్ల బకాయిలంటూ ధర్నాకు దిగ డం విడ్డూరం.
ప్రభుత్వం ఇకనైనా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. పథకాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరమూ ఉంది. పేద విద్యార్థి చదువుకు బ్రేక్ పడకుండా చూడటమే ని జమైన సంస్కరణ. ఇక రేవంత్ ప్రభుత్వం రూ.2,875.69 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించడం ముదావహం.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355