5 July, 2026 | 11:28 PM

తొలి అడుగు ఎవరిదో?

21-05-2024 12:46 AM

* సీజన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను వణికిస్తూ వచ్చిన జట్టు ఒకవైపు.. నిలకడైన ఆటతీరుతో సీజన్‌లో మొదట ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన జట్టు మరోవైపు.. బుల్‌డోజర్స్‌గా ముద్ర పడిన ఆ రెండు బలమైన జట్లు ఎదురుపడితే  విధ్వంసం ఎలా ఉంటుందనే ఊహ మాటలకు అందనిది. ఎదుట ఎవరున్నా సరే బాదుడే లక్ష్యం అనే కామన్ పాయింట్‌తో బరిలో దూకుతున్నాయి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్. చివరి అంకానికి చేరుకున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య నేడు తొలి క్వాలిఫయర్ పోరు జరగనుంది.

* ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. ఎందుకంటే గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశముంటుంది. భారీ స్కోర్లను అవలీలగా ఛేదించడంలో పోటీ పడుతున్న రెండు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ తరపున హెడ్, అభిషేక్‌లు విధ్వంసం సృష్టించాలని భావిస్తుంటే.. అవతలి జట్టులో మేము తక్కువ తిన్నామా అన్నట్లుగా నరైన్, రస్సెల్ రెచ్చిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రెండు జట్లు కొదమ సింహాల్లా తలపడనున్నాయి. మరి ఈ రెండింటిలో తొలుత ఫైనల్ చేరెదెవరనేది ఆసక్తికరం!

నేడు క్వాలిఫయర్ : 1

కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ 

గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు

అహ్మదాబాద్: ఐపీఎల్ 17వ సీజన్‌లో మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మధ్య తొలి క్వాలిఫయర్ పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన కేకేఆర్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడి మధ్యలో తడబడి మళ్లీ ఆఖర్లో ఫుంజుకున్న హైదరాబాద్ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో రెండో స్థానానికి దూసుకొచ్చి క్వాలిఫయర్ సిద్ధమైంది.

లీగ్ దశలో కోల్‌కతా, హైదరాబాద్ ఒకే మ్యాచ్‌లో తలపడగా.. అందులో కేకేఆర్ విజయం సాధించింది. పరుగుల వరద పారిన ఐపీఎల్ అహ్మదాబాద్‌లో మాత్రం భారీ స్కోర్లు నమోదు కాలేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో కేవలం రెండు సార్లే రెండొందల పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఈ గ్రౌండ్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయాలు అందుకోవడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపనుంది. లీగ్ దశ చివర్లో మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడితో క్వాలిఫయర్ ఎలాంటి ముప్పులేదు. 

ప్రమాదకరంగా హైదరాబాద్..

గత సీజన్లతో పోలిస్తే అసలు ఆడుతుంది సన్‌రైజర్స్ హైదరాబాదేనా అన్నట్లుగా సాగుతుంది మన జట్టు విధ్వంసం. ఒకప్పుడు లో స్కోరింగ్‌లను కాపాడుకుంటూ 2016లో చాంపియన్‌గా నిలిచిన రైజర్స్ ఈసారి మాత్రం గేర్ మార్చింది. భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారింది. బలమైన బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ సొంతం. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నారు. మ్యాచ్‌లో ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లను చితక్కొడుతున్న ఈ ఇద్దరు ఎడాపెడా దంచుతూ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు.

వీరిద్దరి విధ్వంసాన్ని రాహుల్ త్రిపాఠి, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు కొనసాగిస్తున్నారు. ఇక షెహబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్‌లు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ తాండవమే ఆడాడు. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి సీజన్‌లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచాడు. ఇక పాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్ విభాగం మాత్రం కాస్త బలహీనంగా ఉంది. మార్కండే విఫలం కావడంతో అతడి స్థానంలోకి వచ్చిన విజయ్‌కాంత్ పర్వాలేదనిపిస్తున్నాడు.

సాల్ట్ దూరమైనా..

ఇప్పటికే రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కప్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. లీగ్ దశలో కేకేఆర్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ ఫిల్ సాల్ట్ (435 పరుగులు) దూరమవ్వడం ఆ జట్టుకు ఎదురుదెబ్బే. ప్రపంచకప్‌కు ముందు పాక్‌తో సిరీస్ ఆడేందుకు సాల్ట్ వెళ్లిపోవడంతో నరైన్‌కు జతగా ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది చూడాలి. 

ఈ సీజన్‌లో విధ్వంసాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లిన సునీల్ నరైన్ (461 పరుగులు) అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. మెంటార్‌గా గంభీర్ వచ్చాకా ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన నరైన్ భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థుల పాలిట విలన్‌లా తయారయ్యాడు. శ్రేయస్ (287 పరుగులు) బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ కెప్టెన్‌గా మాత్రం అదరగొడుతున్నా డు. తన నిర్ణయాలతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

మిడి లార్డర్‌లో అంగ్‌క్రిష్ రఘవంశీ, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలు రాణిస్తున్నా రు. ఇక ఫినిషర్లుగా రసెల్, రింకూ సింగ్‌లు అదరగొడుతున్నారు. కేకేఆర్ బౌలింగ్ విభాగం మా త్రం పటిష్టంగా కనిపిస్తోం ది. మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలకు తోడు మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు.