31 July, 2026 | 7:54 AM

మీ దేశం సంగతి చూసుకోండి

26-05-2024 02:21 AM

పాక్ నేతకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చురకలు

న్యూఢిల్లీ, మే 25: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్‌మీడియా వేదికగా పాకిస్థాన్‌కు చెందిన ఓ నేతకు గట్టిగా చురకలంటించారు. లోక్‌సభ ఆరో విడత పోలింగ్‌లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. కేజ్రీవాల్ తన తండ్రి, భార్యాపిల్లలతో కలిసి ఓటు వేశారు. ఆ విషయాన్ని సోషల్‌మీడియాలో తెలిపారు. ‘మా నాన్న, నా భార్య, ఇద్దరు పిల్లల తో కలిసి ఇవాలి ఓటు వేశాను. నా తల్లికి తీవ్ర అనారోగ్యం ఉన్నందున ఆమె ఓటు వేయలేకపోయారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నేను ఓటు వేశాను’ అని అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై పాకిస్థాన్ నేత ఫవాద్ హుస్సేన్ చౌదరి స్పందించారు. ‘విద్వేషం, వేర్పాటువాదాలపై శాంతి, సామరస్యం విజయం సాధించుగాక’ అని సందేశం రాశారు. ఇందుకు కేజ్రీవాల్ గట్టిగానే స్పందించారు. ‘మా సమస్యలను పరిష్కరించుకొనే పూర్తి సామర్థ్యం మాకు ఉన్నది. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. అందువల్ల మీరు మీ దేశం గురించి శ్రద్ధ తీసుకొంటే మంచిది’ అని సూచించారు.