calender_icon.png 18 September, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను అసెంబ్లీలో కూర్చొబెడతా

18-09-2025 01:40:26 AM

-కొత్త పార్టీని స్థాపించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

-తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఇన్నేళ్లుగా శాసనసభ మెట్లు కూడా ఎక్కని బీసీలను అసెంబ్లీలో కూర్చోబెడతానని టీఆర్‌పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని హోటల్ తాజ్‌కృష్ణ వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్‌పీ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల కలబోతతో పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఆయన ప్రకటించి మాట్లాడారు.

ఇక నుంచి బీసీలు గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్, తెలంగాణ భవన్ దగ్గర బీ ఫామ్ కోసం వేచి చూసే రోజులకు స్వస్తి అని పేర్కొన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో టీఆర్‌పీ పోటీ చేస్తుందని, 2028 ఎన్నికలే లక్ష్యంగా గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం, అధికారం, తమ వాటా తమకు దక్కాలనే డిమాండ్‌తోనే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఇన్ని రోజులుగా ప్రజల పక్షాన తాను పనిచేశానని నమ్మితేనే తనకు మద్ద తివ్వాలని, లేకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకైనా తాను సిద్ధమేనని ప్రకటించారు. అస్తిత్వంపై దెబ్బ కొడుతున్నవారి అహంకారాన్ని ఓట్ల ద్వారా అణచివేస్తామని మండిపడ్డారు.  

పలువురితో కార్యవర్గం 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీకుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్లను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్‌తోపాటు మరికొంత మందిని నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలుగా పటేల్ వనజను నియమిస్తున్నట్లు ప్రక టించారు. కోశాధికారులు, కార్యదర్శులను నియమించారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్లు మురళి మనోహర్, కొండల్ రావు, జ్వలిత, పూర్ణచందర్, నరేంద్ర బాబు పాల్గొన్నారు.