calender_icon.png 6 February, 2026 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే బ్రిడ్జి పనులు పూర్తికాక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా..

06-02-2026 12:41:55 AM

మహిళల ఆవేదన

ఘట్ కేసర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి కాక పోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా అంటూ మహిళలు ప్రశ్నించారు. గురువారం ఘట్ కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీ లోని స్వామి వివేకానంద యువజన సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘట్ కేసర్, కొండాపూర్ మహిళలు పాల్గొని నత్తనడకన కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి పనుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని ప్రాంతాలలో బ్రిడ్జి నిర్మాణాలు పూర్తవుతున్నాయి కానీ ఘట్ కేసర్ పట్టణంలో మాత్రం 17 సంవత్సరాలు అవుతున్న పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. 90 శాతం పూర్తి అయ్యిందని నాయకులు, కాంట్రాక్టర్ చెబుతున్నారని ఆ 10 శాతం ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు కాలినడకన రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు.

పూర్తికాని బ్రిడ్జి మూలంగా తమ పిల్లలను ఒక గంట ముందే పాఠశాలలకు పంపాల్సి వస్తుందన్నారు. జిల్లా బస్సులు పట్టణంలోకి రాకపోవడంతో ప్రజల ఇబ్బందులు వర్ణించలేనివన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లాలన్న చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ దారుణమన్నారు. అత్యవసరాలకు ఆటో వాళ్ళు రావాలంటే అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

పాలకులు మారుతున్నారు తప్ప బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదన్నారు. కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే లకు అనేక వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేదన్నారు. ఇక సహించలేమని బ్రిడ్జి నిర్మాణానికి ఈనెల 8వ తేదీన మహిళలం అంతా  శాంతియుత ర్యాలీ చేపడుతున్నామని కావున ప్రతి మహిళ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించాలి తప్ప తమకు ఉచిత పథకాలు ఎందుకన్నారు.