2 August, 2026 | 11:27 AM

ప్రజాస్వామ్యం నిర్వీర్యం

23-05-2024 07:03 AM

ఎన్డీయే ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు

అన్ని వ్యవస్థలను బలహీనపరిచారు

ధనవంతుల కోసమే మోదీ ప్రభుత్వం పాలసీలు రూపొందించింది

అదానీలాంటి వారికి దేశ సంపదను ధారాదత్తం చేసింది

రాంచీ, మే 22: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దేశంలోని శాసన, న్యాయ వ్యవస్థను బలహీనపరిచిందని దుయ్యబట్టారు. కేంద్ర పాలసీలను వ్యతిరేకించిన వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. బుధవారం ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారు.

ఇప్పటికే దేశంలోని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారు’ అని ఆరోపించారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను తప్పుడు కేసులతో జైలులో పెట్టారని, ఆయన భార్య కల్పన పులిలా పోరాడుతున్నారని చెప్పారు. గతంలో పార్లమెంటులో చట్టాలు రూపొందించేందుకు చర్చలు జరిగేవని, కాకపోతే మోదీ హయాంలో ప్రతిపక్షాలపై దాడి చేసేందుకే సభను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలాగా కాకుండా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆదివాసీల హక్కులను బలపరుస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ నుంచి బీజేపీ రూ.52 కోట్ల విరాళాలు సేకరించిందని గుర్తు చేశారు. 

ఆదివాసీల ఆస్తులపై కన్ను..

ధనవంతుల కోసమే మోదీ ప్రభుత్వం పాలసీలు రూపొందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి మోదీ ప్రభుత్వం ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వేస్టేషన్లను ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. కొందరు ధనవంతులకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు మాత్రం మనసు రాలేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు ఆదివాసీల నీళ్లు, అడవులు, భూములపై కన్నేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. జార్ఖండ్‌లోని గొడ్డాలో పచ్చని అడవుల్లో అదానీగ్రూప్ మెగా పవర్ ప్రాజెక్టు ప్లాంట్ నిర్మించిందని, అయితే ఇక్కడి పేద ప్రజలకు విద్యుత్ మాత్రం ఉచితంగా ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. 

విజయం మాత్రమే కావాలా?

చంద్రయాన్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మోదీ.. దాని కోసం కృషి చేసిన హెచ్‌ఈసీ ఉద్యోగులకు మాత్రం జీతాలివ్వడం మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. కాగా, రాంచీలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా స్థానిక ఆదివాసీ మహిళలతో  ప్రియాంక గాంధీ కాలు కదిపారు. కాసేపు వారితో నృత్యం చేస్తూ సరదాగా గడిపారు. అక్కడి చూపరులను ప్రియాంక గాంధీ నృత్యం చేయడం ఆకట్టుకుంది.