పాతిపెట్టిన శవాన్ని ఎందుకు చోరీ చేశారు?
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీమనోహర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. మేకర్స్ శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, ఆసక్తికరంగా సాగుతోంది. తెలివితక్కువ వాళ్లతో వ్యవహరించడంలో అనుభవజ్ఞుడైన జడ్జి జీ వైద్యనాథన్ దగ్గరకు హియరింగ్‌కు వచ్చిన విచిత్రమైన కేసు రావడం..
నలుగురు స్నేహితులు శ్రీశైలం అడవులకు వెళ్తే అక్కడ ఏం జరిగింది? అక్కడ సమాధి చేసిన శవాన్ని దొంగతనం చేసేందుకు హీరో బ్యాచ్, మరికొన్ని గ్యాంగ్స్ ఎందుకు వేట సాగిస్తున్నాయి? అన్న సందేహాలు రేకెత్తిస్తూ ఆసక్తిని పెంచేలా ట్రైలర్ కట్ చేశారు.
గుర్రం పాపిరెడ్డిగా నరేశ్ అగస్త్య, అతని స్నేహితులు సౌధామినిగా ఫరియా అబ్దుల్లా, మిలటరీగా రాజ్‌కుమార్ కాసిరెడ్డి, చిలిపిగా వంశీధర్ కోస్గి పాత్రలు నవ్వించేలా ఉన్నాయి. బ్రహ్మానందం ఇందులో జడ్జిగా కనిపించారు. యోగిబాబు, ప్రభాస్ శ్రీను, జీవన్‌కుమార్, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతం అందించగా, అర్జున్‌రాజా డీవోపీగా పనిచేశారు.




