1 April, 2026 | 2:56 AM

మద్యం మత్తులో భార్య, కొడుకు హత్య

01-04-2026 01:27 AM

రోకలితో మోది చంపిన వైనం

రంగారెడ్డి జిల్లా పులిగోనిపల్లి తండాలో ఘటన

ఆమనగల్లు, మార్చి 31: కన్నప్రేమ కరువైంది.. కట్టుకున్నవాడే కాలయముడయ్యా డు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి రోకలి కర్రతో దాడి చేసి తన భార్యను, ఐదేళ్ల పసిగుడ్డును అతి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తండా పంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాకు చెందిన బాణావత్ రాందాస్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు.

ఇతనికి భార్య కవిత (28), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాందాస్ తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి మ ద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాందాస్, భార్య కవితతో గొడవకు దిగాడు. గొడవ ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు ఇంట్లోని రోకలి కర్రను తీసుకొని భార్య కవితపై, కుమారుడు హర్షీత్ (5), కుమార్తె ప్రణీతపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల పగిలి కవిత, హ ర్షీత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రణీతను హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. నిందితుడిపై 2023లోనే వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాందాస్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.  ఏసీపీ జానకిరెడ్డి బాధితులకు తక్షణ సాయంగా రూ.5 వేలు అందజేశారు.