భర్త చేతిలో భార్య హతం?

16-09-2026 | 05:10am

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా(Siddipet District)లో ఓ వివాహిత(Married woman) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని మృతురాలి అక్క అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన రౌనక్ పర్వీన్(Raunak Parveen), తన ముగ్గురు చెల్లెళ్లతో కలిసి జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం ప్రజ్ఞాపూర్ కు వలస వచ్చారు. ఆమె చిన్న చెల్లెలు రోజీ పర్వీన్ (19) ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో భరత్నగర్కు చెందిన మద్దూరి బాల్ లింగం అలియాస్ రాకేష్తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం ప్రేమగా మారడంతో సుమారు ఆరు నెలల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వారు చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో టీ కొట్టు నడుపుతూ అదే ప్రాంతంలో అద్దెకుంటున్నట్టు పేర్కొన్నారు. పెళ్లైన కొద్దిరోజుల నుంచే రాకేష్ మద్యం సేవించి తనను కొడుతూ, వేధిస్తున్నాడని రోజీ పర్వీన్ ఫోన్లో చెప్పేదని ఆమె అక్క రౌనక్ పర్వీన్ తెలిపారు. వేధింపులు భరించలేక 20 రోజుల క్రితం రోజీ తన అక్క వద్దకు ప్రజ్ఞాపూర్కు వచ్చి ఉన్నట్లు చెప్పారు.

వారం క్రితం రాకేష్ వద్దకు వెళ్తున్నానని చెప్పి రోజీ వెళ్లిందని, అనంతరం ఫోన్లో మాట్లాడగా సిద్దిపేటలో ఉంటూ ఓ హోటల్లో పని చేస్తున్నానని చెప్పినట్లు ఆమె అక్క వెల్లడించారు. సెప్టెంబర్ 11న సాయంత్రంరోజీ తన అక్కకు ఫోన్ చేసి, రాకేష్ ఫోన్ చేసి తనను రమ్మని బలవంతం చేస్తున్నాడు అని చెప్పినట్లు తెలిపారు. మరుసటి రోజు అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు ఫోన్ చేసి, పుల్లూరు పాత రోడ్డు బైపాస్ వద్ద రోజీ పర్వీన్ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతదేహాన్ని పరిశీలించగా, ముఖంపై గాయాలు, మెడపై నులిమినట్లు గుర్తులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. రోజీ పర్వీన్ మృతికి ఆమె భర్త రాకేష్ కారణమై ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు రాకేశ్ నేరాన్ని అంగీకరించాడని, జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించామని తెలిపారు.

మరిన్ని వార్తలు