లక్నో సాధిస్తుందా?
* ఐపీఎల్‌లో టైటిల్ అందని మరొక జట్టు లక్నో సూపర్ జెయింట్స్... స్టార్ ప్లేయర్స్ టీమ్ నిండా ఉన్నా మాత్రం రాత మారడం లేదు. కేఎల్ రాహుల్ స్థానంలో పగ్గాలు అందుకున్న పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఫలితంగా గత సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి మినీ వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌ను పంత్ టైటిల్ వరకు నడిపించగలడా?
- పంత్ కెప్టెన్సీకి పరీక్ష
- గత సీజన్‌లో ఫ్లాప్ షో
- విదేశీ హిట్టర్లపైనే ఆశలు
- బౌలర్లకు ఫిట్‌నెస్ సమస్యలు
ముంబై, మార్చి 25: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి లక్నో సూపర్ జెయింట్స్ 2022లో అడుగుపెట్టింది. అంచనాలకు మించి రాణించి వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ తొలి సీజన్‌లో జట్టును అద్భుతంగా నడిపిస్తే.. తర్వాత కృనాల్ పాండ్యా స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే 2024, 2025 సీజన్లలో మా త్రం లక్నో నిరాశపరిచింది. 2024 సీజన్‌లో ఏడో స్థానానికి పరిమితవడం, కెప్టెన్ రాహుల్ తో ఫ్రాంచైజీ ఓనర్లకు విభేదాలు రావడంతో అతను జట్టును వీడాడు.
ఆ తర్వాత వేలంలో రిషబ్ పంత్‌ను రికార్డు ధర రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో అతనికే పగ్గా లు అప్పగించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్ సారథిగా ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఈ సారి తనపై ఉన్న అంచనాలను అందుకోవాలని పంత్ పట్టుదలగా ఉన్నాడు. మినీ వేలానికి ముందు జట్టులో పలు మార్పులు చేసుకుంది. సపోర్టింగ్ స్టాఫ్‌ను మార్చుకోవ డంతో పాటు కొందరు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
సన్ రైజర్స్ నుంచి మహ్మద్ షమీని, వేలంలో జోస్ ఇంగ్లీస్, రఘువంశీ, ముకుల్ చౌదరీలను దక్కించుకుంది. ముంబై నుంచి అర్జున్ టెండూల్కర్‌ను కూడా ట్రేడ్ చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు హిట్టర్లే ప్రధాన బలం. బ్యాటింగ్ కాంబినేషన్‌ను చూస్తే మిఛెల్ మార్ష్ , మార్క్ క్రమ్, పంత్ , నికోలస్ పూరన్ వంటి హిట్టర్లతో అత్యంత బలంగా ఉంది.
విధ్వం సకర ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలి చే పూరన్ లాంటి బ్యాటర్ ఆ జట్టుకు అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. పంత్ కూడా బ్యాట్ తో చెలరేగితే తిరుగుండదు. గత సీజన్‌లో అతను అంతగా రాణించలేదు. ఒకవిధంగా ఆ ఐపీఎల్ సీజన్ పంత్ అంతర్జాతీయ కెరీర్ కు కూడా కీలకం కాబోతోంది.
మరోవైపు బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీపై అంచనాలున్నాయి. అతని అనుభవం లక్నోకు కలిసొస్తుంది. అలాగే మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ వంటి దేశవాళీ పేస్ బౌలర్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో నోర్జే కీలకం కానున్నాడు. అర్జున్ టెండూల్కర్‌ను కూడా మీడియం పేసర్‌గా ఉపయోగించుకునే అవకాశముంది. అయితే పేసర్లంతా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండడం మైనస్ పాయింట్. అటు స్పిన్ విభాగంలో హసరంగాపై అంచనాలున్నాయి.
దేశవాళీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపైనా లక్నో ఆశలు పెట్టుకుంది. గత సీజన్‌లో దిగ్వేశ్ సత్తా చాటాడు. లక్నో జట్టుకు కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. ఎక్కువమం ది హిట్టర్లున్నా సమిష్టిగా రాణించలేకపోతుండడం గత సీజన్‌లో ప్రభావం చూపింది. లోయర్ ఆర్డర్‌లో బదో ని, అబ్దుల్ సమద్ కూడా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు.
సరైన మ్యాచ్ ఫినిషర్ లేకపోవడం కూడా లక్నోకు మైనస్‌గా మారింది. పూరన్, పంత్ తర్వాత మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే బ్యాటర్ లేకపోవడం కూడా ఇబ్బందిగా కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లో పేసర్లు ఎంతవరకూ సమి ష్టిగా రాణిస్తారనేది చూడాలి. గత సీజన్‌లో షమీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా ట్రేడింగ్‌లో అతన్ని తీసుకున్న లక్నో పేస్ ఎటాక్‌ను షమీ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, ఆయుష్ బదోని, మహ్మద్ షమి, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రాఠి, మిచెల్ మార్ష్, మార్క్రమ్, బ్రీజ్కే, నికోలస్ పూరన్, జోష్ ఇంగ్లిస్, హసరంగ, ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ తెందుల్కర్, నమన్ తివారి, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ.




