16 May, 2026 | 2:48 AM

ప్రజా పాలన పట్టాలెక్కేనా..!?

16-05-2026 01:32 AM
  1. నేటికే సమయపాలన పాటించని జిల్లా అధికారులు
  2. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
  3. తేదీలు మార్చి తప్పుడు రిపోర్టులు సమర్పిస్తున్న అధికారులు
  4. ప్రధాన శాఖల్లో పెచ్చుమీరుతున్న అవినీతి, అలసత్వం
  5. ఏళ్ల తరబడి తప్పుడు రిపోర్టులతో దర్శనమిస్తున్న ఎన్‌ఐసి. 
  6. నూతన కలెక్టర్ రాకతో తీరు మారుతుందని ఆశాభావం

 నాగర్ కర్నూల్ మే 15 ( విజయక్రాంతి ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన ఈ ప్రాంతం ప్రజాపాలనలో ఊహించని రీతిలో సంక్షేమం, అభివృద్ధితో పరుగులు పెడుతుందని జనమంతా ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. కానీ అందుకు తగినట్లుగా ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఇలా వచ్చి ఆలా వెళ్ళామా అనే రీతిలో తీవ్ర అలసత్వం, అవినీతితో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి.

జిల్లా ఉన్నత స్థాయి అధికారుల కుర్చీకి అతి చేరువగా పనిచేసే కొంత మంది ఉద్యోగులు చాలా కాలంగా పాతుకుపోయి మరి కొంత మంది అక్రమార్కులకు వంత పాడుతున్నారని చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ హోదాలో పని చేసే ఉద్యోగి నూతన జిల్లా ఏర్పాటు సమయంలో డిప్యూటేషన్ పై చేరి నీటికీ కొనసాగుతున్న పరిస్థితి. ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో మెప్పు పొంది షాడో అధికారిగా అన్నీ తానై జిల్లాలోని ఆయా శాఖల్లో అక్రమ డిప్యూటేషన్లకు కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్లు విమర్శలున్నాయ్.

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిన తన అనుకూల వ్యక్తులు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిప్పించినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేస్తూ అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఆయా ప్రధాన శాఖల అధికారులు అలసత్వం ప్రదర్శిస్తూ అడిగేవారే లేరన్న రీతిలోనే అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అలవాటుగా మారిన అలసత్వం...!

జిల్లాలోని ఆయా ప్రధాన శాఖల ఉన్నతాధికారులు స్థానికంగానే ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ హైదరాబాద్, మహబూబ్నగర్ వంటి పట్టణాల్లో ఉంటూ కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్న పరిస్థితి. ఆయా శాఖల అధికారుల కోసం వచ్చిన జనానికి మాత్రం ఫీల్ విజిట్ పేరుతో తప్పించుకో తిరుగుతున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు రివ్యూ మీటింగ్ వంటి కార్యక్రమాలకు తేదీలు మార్చి తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రెవెన్యూ, మైనింగ్, సివిల్ సప్లై, మున్సిపాలిటీలు, మార్కెటింగ్, విద్య, వైద్య ఆరోగ్యశాఖ వంటి ప్రధాన శాఖల్లోనూ అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడింది. అలసత్వానికి తోడుగా ప్రతి ఫైలుకు ధర నిర్ణయిస్తూ అవినీతికి పాల్పడుతున్న శాఖలు మరెన్నో ఉన్నాయి.

ఉన్నతాధికారుల కుర్చీకి అతి చేరువలో ఉండే కొంతమంది అధికారులు ఇతర శాఖ అధికారులకు సమాచారం చేరవేస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో జిల్లాల్లోని ఆయా శాఖలు, సంక్షేమ ప్రభుత్వ పథకాలు అమలు సమాచారం అంశాలను ప్రభుత్వ వ్బుసైట్లో పొందుపరచాల్సి ఉంది. కానీ ఎన్‌ఐసి అరకొర సమాచారం దర్శనమిస్తోంది. మరికొన్ని శాఖలో తప్పుడు సమాచారమే దర్శనమిస్తోంది. 

నూతన కలెక్టర్ రాకతో తీరు మారుతుందని ఆశ.

నూతనంగా విధుల్లో చేరిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నిత్యం తెల్లవారుజాము నుంచే చేస్తున్న ఫీల్ విజిట్ ఆయా శాఖల అధికారులను షాకింగ్కు గురిచేస్తోంది. గతం ఎలా ఉన్నా ఇకనుండి ప్రతి ఒక్కరూ తమ తీరు మార్చుకోవాలని చెప్పకనే చెబుతూ ముందుకెళ్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో జరిగిన మొదటి సమావేశంలోనే డుమ్మా కొట్టిన జిల్లాస్థాయి అధికారికి మెమో జారీ చేయడంతో ప్రారంభమై అలసత్వం వహించే ఏ ఒక్క అధికారిని వదిలిపట్టే ప్రసక్తే లేదంటూ హింట్ ఇచ్చారు.

కానీ జిల్లా కలెక్టర్ ఆలోచన విధానాలు తాను తీసుకునే ముందస్తు నిర్ణయాలు పర్యటన వివరాలు వంటి అంశాలు ముందుగానే భహిర్గతం అవుతున్నాయని చర్చ జరుగుతుంది. అన్ని శాఖల్లోనూ రివ్యూ జరిపితేనే పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అక్రమాలు జరిగినట్టు తేలిన అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే మిగతా అధికారులంతా దారిలోకి వస్తారన్న భావన వ్యక్తం అవుతోంది.