పూడికతీత పేరుతో మట్టి అక్రమ తరలింపు
ములకలపల్లి మండలంలో టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా
భద్రాద్రి కొత్తగూడెం , మే 15 (విజయక్రాంతి): సాగునీటి చెరువులలో పూడికతీత పేరుతో మట్టి దందాకు పాల్పడుతున్నారు. ములకలపల్లి మండలంలోని పాతూరు దగ్గర ఉన్న చింతలచెరువు లో ప్రోక్లైన్లు వంటి యంత్రాలను పెట్టి పూడిక తీత పేరుతో పక్కనే ఉన్న పాల్వంచ పట్టణానికి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.
మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.చెరువులో పూడికతీత కోసం తీసిన మట్టిని రైతుల పొలాల్లోకి వాడుకునే వెసులుబాటును అడ్డం పెట్టుకొని లారీ టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ మాఫియా కొనసాగిస్తున్నారు.పక్కనే ఉన్న పాల్వంచ పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.వీరికి మట్టి అవసరం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో మట్టి దొరకడం కష్టంగా మారడంతో చెరువుల్లో పూడికతీత పేరుతో తీసే మట్టిని లారీ టిప్పర్ల ద్వారా పట్టపగలు రాత్రింబవళ్లు తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
పట్టపగలే యంత్రాలతో చింతలచెరువులోని మట్టిని తవ్వి లారీ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నప్పటికి సంబంధిత శాఖలకు చెందినఅధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.పూడిక తీత మట్టి కావలసిన రైతులు ఏ వాహనాల ద్వారా తీసుకు వెళ్ళేది ఏ పరిమాణం మేరకు మట్టి కావాల్సిన వివరాలను తెలియజేస్తూ సాగునీటి శాఖ ఇంజనీరింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారులు అనుమతిస్తారు అనుమతి పొందిన రైతులు మాత్రమే వారు తెలియజేసిన ట్రాక్టర్ల ద్వారానే మట్టిని వారి పొలాల్లోకి తీసుకెళ్లాలి.
రైతుల పేర్లు చెప్పి మట్టిని యంత్రాలతో టిప్పర్లలో నింపి పాల్వంచకు తరలిస్తున్నారు.పాల్వంచకు చెందిన వ్యక్తి యంత్రాలతో తవ్వకాలు చేస్తూ లారీ టిప్పర్ల ద్వారా మట్టిని బయట ప్రాంతాలకు తరలిస్తున్నాడు. రాత్రింబవళ్లు టిప్పర్లు గ్రామాల్లో తిరుగుతుండడంతో ధూళి,శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,చెరువు ఉన్న గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు మాత్రమే చెరువులోని పూడికతీతమట్టిని ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి.
గ్రామపంచాయతీ పరిధి దాటి బయటకు మట్టిని తరలించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి మట్టిని తరలిస్తున్న అడ్డుకునేవారు కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి చెరువుల్లో పూడికతీత పనుల పేరిట మట్టిని పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న మట్టి మాఫియా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకొని వాహనాలను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ములకలపల్లి ఇరిగేషన్ శాఖ ఏ ఈ సంధ్యారాణిని ’విజయ క్రాంతి’ గురువారం వివరణ కోరగా లారీ టిప్పర్ల ద్వారా చింతల చెరువులోని మట్టిని తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే మట్టి తవ్వకాలను నిలిపివేసినట్లు తెలిపారు.






