2 August, 2026 | 6:24 AM

‘అవినీతి చిట్టా బయటకు తీస్తా!

28-05-2024 12:10 AM

మంథని, మే 27 (విజయక్రాంతి): పవిత్ర మంత్రపురి.. మంథని ప్రతిష్ఠను గత పాలకులు భ్రష్టు పట్టించారు. మంథని పురపాలికలో ఏ పేజీ తెరచినా అవినీతి మరకలే కనిపిస్తున్నాయి. గత పాలకవర్గ హయాంలో నాయకులే బాగుపడ్డారు తప్ప ప్రజలకు జరిగిన మేలు శూన్యం. సింగరేణి యాజమాన్యం నాటిన మొక్కలకు మున్సిపాలిటీ పరిధిలో బిల్లులు చేయించుకుని సొమ్ము కాజేశారు. సింగరేణి యాజమాన్యం నాటించిన మొక్కలకు బిల్లులు చేయించి రూ.50 లక్షల వరకు దోచేశారు. అవినీతి చిట్టా బయటకు తీస్తా. ప్రతి పైసా రికవరీ చేస్తా. అప్పటి చైర్‌పర్సన్ పుట్ట శైలజతో పాటు పాలకవర్గ అవినీతిని ప్రజల ముందు పెడతా’ అని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమా సురేశ్‌రెడ్డి తమ ఘంటాపథంగా చెప్పారు. సోమవారం ఆమె ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 

మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అక్రమాలపై ధ్వజమెత్తారు. మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఎన్నికల కోడ్ ముగియగానే మాస్టర్ ప్లాన్‌ను ప్రకటిస్తామన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను పెకిలిస్తామన్నారు.

మంథని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మార్పు తీసుకువస్తారా ?

తప్పకుండా. తాను బాధ్యతలు తీసుకున్నాక ప్రతి రోజు ఉ.7 గం.ల నుంచి ప్రజల వద్దకు నేరుగా వెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాం. నాలుగేళ్లలో జరగని అభివృద్ధిని ఈ 7 నెలల్లో మంథనిలో చేసి చూపిస్తాం. కాంగ్రెస్ ప్రజా పాలన ఏ విధంగా ఉండబోతుందనేది త్వరలోనే ప్రజలు చూస్తారు. ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మంథని పురపాలకంలో సమూల మార్పులకు చర్యలు చేపట్టబోతున్నాం. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశాము. అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. మాపై ప్రజలు పెద్ద నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా మార్పు తీసుకవచ్చి తీరుతాం.

గత పాలక వర్గంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మీ స్పందన?

అవినీతి గురించి చెప్పేందుకు నాకే సిగ్గుగా ఉంది. పురపాలికలో అవినీతి మామూలుగా జరగలేదు. ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగమైంది. పట్టణంలో అనుమతులు లేకుండానే అక్రమ కట్టడాల నిర్మాణం జరిగింది. ప్రతి విషయంలో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క పెట్రోల్ బంక్‌లోనే రూ.45 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మేం బాధ్యతలు తీసుకున్నాక ప్రతి నెలా బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నాం. అక్రమాలను ఇప్పటికే మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకవెళ్లాం. అవినీతి అనే మాట లేకుండా పాలన అందించేందుకు కృషి చేస్తున్నాం.

అవినీతిపరులపై చర్యలు ఉంటాయా?

తప్పకుండా ఉంటాయి. గడిచిన నాలుగేళ్లలో జరిగిన అవినీతి చిట్టాను బయటకు తీస్తున్నాం. హరితహారం కింద మొక్కలు నాటకుండా, నాటినట్లు దొంగ రికార్డులు తయారు చేశారు. రూ.50 లక్షలు కాజేశారు. సింగరేణి సంస్థ నాటిన మొక్కలను చూపించి బిల్లులు సృష్టించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే అక్రమాలను నిలదీస్తే మమ్మల్ని హేళన చేశారు. ‘మొక్కలు నాటాం. రోడ్డు వైండింగ్ పోయాయి’ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు. అప్పుడు మాకు అధికారం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. అవినీతి అక్రమాలను బయటకు తీస్తాం. 

అప్పటి చైర్‌పర్సన్ పుట్ట శైలజపై చర్యలు ఉంటాయా ?

ఎందుకుండవు.. తప్పకుండా ఉంటాయి. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. నేను తప్పు చేసినా ప్రతిఫలం అనుభవించాల్సిందే. గత పాలకవర్గం హరితహారం పేరుతో రూ. 50 లక్షలు కాజేసింది. అది నిరూపణ అయితే అప్పటి చైర్‌పర్సన్ పుట్ట శైలజపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎవరెవరు ఎంత తిన్నారో లెక్కకట్టి అంతా బయటకు కక్కిస్తాం. బాధ్యులకు శిక్ష పడేలా చూస్తాం. మేం ప్రజల ముందు తల వంచుతాం కానీ రాజకీయ ఒత్తిళ్లకు కాదు. 

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నారా? 

ప్రస్తుతం అదే పనిలో ఉన్నం. తలాపున గోదావరి పారుతున్నది. ఆ జలాలను సద్వినియోగం చేసుకుని తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. నీటిఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాం. రూ.35 లక్షలతో ఫిల్టర్‌బెడ్ వద్ద మోటార్‌ను బిగించే పనులు చేయిస్తున్నాం. పోచమ్మ వాడలో 80 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకు నిర్మిస్తున్నాం. 22 కి.మీ మేర పైపులైను వేస్తున్నాం. ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేయిస్తాం.

మంథని అభివృద్ధి ఏ విధంగా ఉండబోతున్నది?

గత పాలకుల్లా మేం మాటలు చెప్పం. చేసి చూపిస్తాం. ఇప్పటికే అభివృద్ధిపై సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్ రావడంతో వేచి ఉన్నాం. మంత్రి శ్రీధర్‌బాబు మన్సిపాలిటీ అభివృద్ధిపై కృతనిశ్చయంతో ఉన్నారు.  డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపుతాం. గోదావరిపై వంతెన నిర్మాణానికి ఇప్పటికే నిధులు రాబట్టాం. శ్రీరాంనగర్ నుంచి మంథని వరకు 5 కి.మీ మేర సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయి. మాతా శిశు విభాగ ఆస్పత్రి నిర్మాణ దశలో ఉన్నది. వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ప్రజల ఆశీర్వాదాలు అందుకుంటాం.