21-02-2026 01:24:36 AM
‘యూరియా బుకింక్ యాప్’తో అవస్థలు
నిమిషం వ్యవధిలోనే ఒక రోజు కోటా పూర్తి
రెండు బస్తాల కోసం ఐదారు రోజులు ఎదురుచూపు
కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానం
ఇప్పటివరకు 8.50 లక్షల టన్నులు మాత్రమే పంపిణీ
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి విండో కార్యాలయానికి తాళం వేసిన రైతులు
యాదాద్రి జిల్లా సర్వేలులో యూరియా కోసం రైతు కన్నీరు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : తెలంగాణలో రైతుల యూరి యా కష్టాలు తీరడం లేదు. యూరియా కొరతను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా.. సత్ఫలితాలు అంతంత మాత్రమే. యూరియా కోసం అయితే బారులుదీరడం.. లేదంటే పడిగాపులు కాయడం అన్న పరిస్థితి దాపు రించింది. వానాకాలంలో రైతులు రోజు ల తరబడి తిప్పలుపడినా దొరకని పరిస్థితులే.
క్యూ లైన్లో నిల్చోవడం, అవస రమైతే చెప్పులు పెట్టిన సందర్భాలు రాష్ట్రంలో కోకొల్లలు. అంతేకాకుండా రైతులు రోడ్లపై ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రైతులను ఆ పరిస్థితి నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే యూరి యా బుకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది.
యాసంగి మొత్తానికి 10.04 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 9.10 లక్షల టన్నుల యూరియా కేంద్రం నుంచి దిగుమతి అయ్యింది. అందులో 8.5 లక్షల టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లాలో 7.45 లక్షల బస్తాలు, జగి త్యాలలో 5.08 లక్షల బస్తాలు, పెద్దపల్లి జి ల్లాలో 3.8 లక్షల బస్తాలు, జనగామలో 3.08 లక్షల బస్తాలు, ఖమ్మం జిల్లాలో 2.85 లక్షల బస్తాల యూరియా పంపిణీ చేశారు.
సూర్యాపేట 2.77 లక్షల బస్తాలు, మహబూబ్‌నగర్‌లో 2.68 లక్షల బస్తాలు, మహబూ బాబాద్‌లో 1.75 లక్షల బస్తాలతో పాటు మిగతా జిల్లాలలోనూ లక్షకు పైగా బస్తాలను రైతులకు అందజేశారు. ఇక అతి తక్కువగా మేడ్చల్ మల్కాజ్‌గిరిలో జిల్లాలో 2,390 బస్తాలు, కొమ్రంభీమ్‌ఆసిఫాబాద్‌లో 6,314, ములుగు జిల్లాలో 19,037 బస్తాల యూరియాను రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం
యాప్ ద్వారా యూరియా పొందాలంటే భూమి పట్టాదారు పాసుబుక్ వివరాలు, భూమి హక్కు కలిగిన రైతు సెల్‌ఫోన్ నంబర్‌లో నమోదు కావాల్సి ఉంటుంది. అయితే, కౌలు రైతులు నేరుగా యూరియా కొనే పరిస్థితి లేదు. కౌలు రైతులు భూమి ఎవరి వద్ద కౌలుకు తీసుకున్నారో.. వారి పేరు మీదనే యూరియా బస్తాలను బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. పట్టాదారుల యాప్ నుంచి యూరియా బుకింగ్ చేయడానికి ఓటీపీ వస్తుంది.
ఈ నంబర్‌ను కచ్చితంగా యాప్ లో నమోదు చేయాలి. అందుకు పట్టాదారు రైతులు ఒప్పుకోవడం లేదు. ఓటీపీలతో త మ ఖాతాలో ఉన్న నగదు పోతుందని, యూ రియా యాప్ విషయంలో తమ వద్దకు రావద్దని కౌలు రైతులు భూమి పట్టాదారు లు హెచ్చరిస్తున్నారు. దీంతో కౌలు రైతులు పంట సాగు చేయకుండా పడావు భూముల వారిని ఆశ్రయించి వారి పేరుతో యూరియాను బుక్‌చేసుకొని పంటలో వేస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు చట్టాలను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు లబ్ధి పొందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
యాప్‌తో తిప్పలే..
యూరియా బుకింగ్ యాప్‌ను ప్రభుత్వం ఐదు జిల్లాల్లో ప్రయోగత్మాకంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ యాప్‌ను 22 జిల్లాలకు విస్తరించారు. రైతులు తమకు కావాల్సిన యూరియాను ఇంట్లో నుంచే సెల్‌ఫోన్‌లోనే ‘యూరియా బుకింగ్ యాప్’ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయినా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యాప్ ఓపెన్ చేసిన నిమిషం వ్యవధిలోనే ఒక రోజుకు సంబంధించిన కోటా నమోదవుతుంది.
ఆ సమయం లో అప్రమత్తంగా ఉన్న రైతులకే యూరియా దొరుకుతున్నది. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడం తెలియని రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రోజు ఉదయం నుంచి ఒక గంటపాటు సెల్‌ఫోన్ చేతులో పట్టుకుని ఎదురుచూసే పరిస్థితి నెలకొన్నది. ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులకే యూరియా బుకింగ్ తొందరగా అవుతుండగా, సాధారణ ఫోన్లు వాడేవారికి ఐదారురోజులు పడుతోం ది.
చిన్న రైతు రెండు బస్తాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. మండలంలో ఏ దుకాణానికి యూరియా కేటాయింపు చేసినా.. ఆ సమాచారాన్ని వ్యవసాయ అధికారు లు ఆయా గ్రామాల వాట్సాప్ గ్రూపు ల్లో పెడుతున్నారు. చదువుకున్న రైతువాట్సాప్ చూసి.. బుక్ చేసుకుంటు న్నారు. ఇక చదువుకోని రైతుల పరిస్థితి మాత్రం అంతే సంగతులు. ఒక వేళ ఫోన్‌లో ఏమైనా సాంకేతిక సమస్యలుంటే.. ఆ రోజు యూరియా బుకింగ్ చేసుకునే వీలు లేకుండాపోతుందని రైతులు వాపోతున్నారు.