calender_icon.png 13 September, 2024 | 12:05 AM

అండర్ కవర్ ఏజెంట్‌తో..

17-07-2024 02:46:49 AM

జాన్వీ కపూర్.. పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా బాలీవుడ్ నటి అయినప్పటికీ అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బాలీవుడ్‌లో ‘దఢక్’ సినిమాతో హీరోయిన్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న తాజా బాలీవుడ్ మూవీ ‘ఉజాల్’. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సారియా దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినమా ఆగస్టు 2న విడుదల కానుంది. కాగా, ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ.. భారత విదేశాంగ విభాగంలో యంగెస్ట్ డిప్యూటీ హై కమిషనర్ సుహానా భాటియా పాత్రలో కనిపించనుంది.

విదేశాల్లో చదువుకున్న సుహానాకు పిన్న వయసులోనే అత్యంత పెద్ద పదవి దక్కటంపై ఆమె కొలీగ్స్ ట్రోల్స్ చేయటం; నెపోటిజం వల్లే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చిందంటూ ఆరోపణలు చేయటం;  పేరు చివరలో భాటియా అని ఉండటం వల్లే ఈ పదవి దక్కిందని కామెంట్ చేయడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ట్రైలర్ రూపొందింది. అనుక్షణం దేశ రక్షణను పర్యవేక్షించే ఇలాంటి విభాగంలో సుహానా టాలెంట్ పనికి రాదని సహచర ఉద్యోగులు భావిస్తున్న తరుణంలో ఓ అండర్ కవర్ ఏజెంట్ నుంచి వచ్చిన సవాల్‌ను ఆమె ఎలా ఎదుర్కొన్నదనేదో ఈ సినిమాలో చూడొచ్చు. ఇక జాన్వీ మదర్ ఇండస్ట్రీగా భావించే టాలీవుడ్ విషయానికొస్తే.. ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ సినిమా ద్వారా తెలుగు తెరపై మెరవునున్నది.

ఇంకా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రామ్‌చరణ్ 16వ సినిమాలోనూ ఈ చిన్నదే హీరోయిన్. ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కానేలేదు, అప్పుడే మూడో అవకాశమూ కొట్టేసిందట జాన్వీ. ‘దసరా’ హిట్ కాంబో నాని ఓదెల మరో మూవీకి సిద్ధమవుతున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్న ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్‌నే అనుకుంటున్నారట.