నిజామాబాద్‌లో బస్సు ప్రమాదం: నలుగురు మృతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad) ఇందల్వాయి మండలం పరిధిలోని గన్నారం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఒక ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుండి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తుండగా, శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారి 44పై(National Highway 44) ఉన్న ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలోని గన్నారం వద్ద, 'ఖురానా ట్రావెల్స్' బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది.
తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. సమీపంలోని ఒక టోల్ ప్లాజా సిబ్బంది తక్షణమే స్పందించి గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి(Government Hospital) తరలించారు.స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.




