12 August, 2026 | 10:52 AM

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య

12-08-2026 10:06 AM

పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని మృతి

నల్గొండక్రైం: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మునుగోడు మండలం(Munugode Mandal) చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) 8 రోజుల క్రితం ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది. ఆమె ఇటీవల ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన మమత, ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ఆసుపత్రి సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.