మహిళామణుల బిగ్‌ఫైట్
l ఈసారి లోక్‌సభ బరిలో ఆరుగురు మహిళలు
l పురుషులతో పోటీ పడుతున్న నాయకురాళ్లు
l కాంగ్రెస్ నుంచి ముగ్గురు.. బీజేపీ నుంచి ఇద్దరు
l బీఆర్‌ఎస్ నుంచి ఒక్కరికి దక్కిన అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి ఆరుగురు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికలో మహిళలకు ఎక్కువగా అవకాశం లభించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి, బీజేపీ ఇద్దరికి, బీఆర్‌ఎస్ ఒక మహిళకు టికెట్లు ఇచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా మరి కొందరు మహిళలు కూడా బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటివరకు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రకటించిన ఆరుగురు మహిళలకు ప్రత్యర్థులుగా పురుష అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఆరుగురులో ముగ్గురు మహిళలు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి నేరుగా లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్నారు. మహిళలు పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో రెండు ఎస్టీ (అదిలాబాద్, మహబూబాబాద్) రిజర్వుడు, ఒకటి ఎస్సీ (వరంగల్), మిగతా మూడు (మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్) జనరల్ నియోజక వర్గాలు ఉన్నాయి.
v మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న డీకే అరుణకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు సాగుతున్నది.
v మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో ఎప్పుడు బీజేపీ ద్వితీయ స్థానానికి పరిమితమవుతూ వచ్చింది. ఈసారి మజ్లిస్ అధినేత అసదుద్దిన్‌పై బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి మానసికంగా మొదట్లోనే ఎంఐఎంను దెబ్బకొట్టాలనే ఆలోచన చేసింది. సోషల్ మీడియాలో పాపులర్‌గా ఉన్న మాధవీలతను హైదరాబాద్ నుంచి బీజేపీ పోటీలో నిలిపింది. ఆమె కూడా ప్రచారంలో ఎక్కడా తగ్గకుండా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఎన్నికల్లో అవలీలగా విజయం సాధించే అసదుద్దీన్ ఒవైసీ ఈ సారి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్ తరఫున గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఎంఐఎంకు మేలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టు బీజేపీ విమర్శిస్తున్నది.
v మహబూబాబాద్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మరోసారి బరిలోకి దిగనున్నారు. మాజీ మంత్రి రెడ్యానాయక్ కుమార్తె అయిన కవిత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి.. కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్‌నాయక్‌పై విజయం సాధించారు. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్ నుంచి కవిత, కాంగ్రెస్ నుంచి బలరామ్‌నాయక్, బీజేపీ నుంచి మాజీ ఎంపీ సీతారాంనాయక్ పోటీలో ఉన్నారు.
v రాష్ట్రంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీత బరిలోకి దిగుతున్నారు. వీరు ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. సునీత ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.
v వరంగల్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి వచ్చారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం వరకు తండ్రి కూతుళ్లు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. కావ్యకు ఇదే స్థానం నుంచి బీఆర్‌ఎస్ టికెట్ కూడా కేటాయించింది. అంతలోనే వారు రాత్రికి రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. కావ్యకు హస్తం పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించుకున్నారు. కడియం కావ్య ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, బీఆర్‌ఎస్ నుంచి హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్‌బాబు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వరకు ఈ ముగ్గురు నాయకులు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు.
v అదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ బరిలోకి దిగుతున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమెను కాంగ్రెస్ పార్టీ నేరుగా లోక్‌సభ ఎన్నికల పోటీలోకి తీసుకొచ్చారు. టికెట్ ప్రకటించేవరకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూనే.. అనేక ప్రజా ఉద్యమాల్లో సుగుణ కీలకంగా పని చేశారు. సుగుణ భర్త సైతం ఆదివాసీల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గెడం నగేష్ పోటీ పడుతున్నారు. నగేష్ ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తపపడుతున్నారు. ఈ ఎన్నికల్లో తమకే విజయం దక్కుతుందని ఎవరికి వారుగా ధీమాగా ఉన్నారు.






