ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
నివాళులు అర్పించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడిపల్లి, మే 21 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, సీనియర్ నాయకులు రాపోలు రాములు, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, కొత్త చందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.






