భట్టికి కరెంట్ షాక్
l సీపీఐ నేతలతో చర్చల సమయంలో విద్యుత్ కోత
l అధికారులతో మాట్లాడి పునరుద్ధరణకు చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు సీపీఐ పార్టీ కార్యాలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కరెంట్ షాక్ తగలింది. విద్యుత్ కోతలు ఉండవని పదే పదే మాట్లాడే ఆయన కరెంట్ కట్ చూడాల్సి వచ్చింది. వెంటనే అప్రమ్తతమైన ఆయన సిబ్బంది.. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ను పునరుద్ధరించారు. అక్కడే ఉన్న క్రామేడ్లు కరెంటు కట్ కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అనంతరం ఇరుపార్టీల నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేవని పేర్కొన్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ ఎన్నికలో కలిసి పనిచేయడానికి ఆ పార్టీ నేతలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు సహకారం, మద్దతు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలు చర్చించామని, రాష్ట్రంలోకి మతోన్మాద బీజేపీని అడుగుపెట్టకుండా చేసేందుకు ఐక్యంగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలు ఎంపీ అభ్యర్థుల విజయం కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.






