పెద్దపల్లి పోరు ద్విముఖం?
l ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు
l ఎన్నికల ప్రచారంలోనూ పోటాపోటీ
l బీజేపీ అభ్యర్థి ‘గోమాస’ నామినేషన్ ప్రశ్నార్థకం
l అధిష్ఠానం అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు
l నేడో రేపో స్పష్టత.. అయినా తప్పని అంతర్గత విభేదాలు
పెద్దపల్లి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ద్విముఖ పోరు నడుస్తుందా అంటే.. ప్రస్తుత పరిణామాలు ఔను అనేలా ఉన్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ఇప్పటికే పోటాపోటీగా ర్యాలీ నిర్వహించి, అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. కానీ ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాత్రం ఇప్పటి నామినేషన్ వేయలేదు. దీంతో అభ్యర్థిని మార్చే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. మరోవైపు పార్టీ శ్రేణుల్లోనూ సందిగ్ధం నెలకొన్నది.
అట్టహాసంగా నామినేషన్లు..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగానే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ చివరగా గడ్డం వంశీని అభ్యర్థిగా ప్రకటించింది. మూడు రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తన తల్లిదండ్రులు వివేక్, సరోజ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి నామినేషన్ వేశారు. ఇదే రోజు బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
గడ్డం వంశీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కుటుంబానికి దశాబ్దాల నుంచి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తాత గడ్డం వెంకటస్వామి ఇదే పార్లమెంట్ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు కేంద్ర క్యాబినేట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వంశీ తండ్రి వివేక్ కూడా గతంలో ఎంపీగా గెలిచారు. ఆ కుటుంబం ఇప్పటికే ట్రస్ట్ పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వంశీ తండ్రి వివేక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిచారు.
అలాగే బెల్లంపల్లి నుంచి వంశీ పెదనాన్న వినోద్ గెలుపొందారు. ఇదే ఒరవడిలో వంశీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించింది. దీనిలో భాగంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్‌చార్జిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించింది. ఆయన ఇప్పటికే రామగుండం, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను ఒకేతాటిలోకి తీసుకొచ్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌కు మంచి ఓటు బ్యాంక్..
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, మంథని, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లిలో బీఆర్‌ఎస్‌కు ఓటు బ్యాంక్ ఉంది. దీంతో దానిని క్యాష్ చేసుకునేందుకు పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కృషి చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ఆయన అందరికీ సుపరిచితుడు. సింగరేణి కార్మికుల ఉద్యమాలతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, చీఫ్ విప్‌గా సేవలందించారు. ఇవన్నీ కొప్పులకు కలిసి వచ్చే అంశాలు. ఇప్పటికే ఆయన పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
వెనుకబడిన బీజేపీ..
బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తర్వాత బీజేపీలో చేరారు. ఆయనకు సీటు ఇవ్వడంపై సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయనకు పార్టీ నేతల నుంచి సరైన సహకారం లేదనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్వక్తమవుతున్నది. మరోవైపు పార్టీలో కీలక నేతలు అనుకున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి, దూగ్యాల ప్రదిబ్‌కుమార్ మధ్య విభేదాలు పార్టీకి కలిసి రాకుండా పోతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో ఇలా రెండు గ్రూపులు ఉండడం పార్టీకి మైనస్. మిగతా అసెంబ్లీ స్థానాల్లోనూ ఇంచు మించుగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఒకటి రెండు రోజుల నుంచి బీజేపీ అధిష్ఠానం తమ పార్టీ అభ్యర్థిని మారుస్తుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత బొర్లకుంట వైపు పార్టీ చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో వెంకటేష్ నేతకు సీటు రాకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు గమనించి ఆయన్ను బీజేపీలోకి లాగేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.






