7 May, 2026 | 10:24 PM

మహిళా విద్యావేత్తలు పెరగాలి

21-05-2024 12:05 AM

భారతీయ మహిళా మేధోశక్తికి నిదర్శనంగా కిందటేడాది (2023 ఆగస్టు) విజయవంతమైన ‘చంద్రయాన్ మూన్ మిషన్ ప్రయోగంలో పాల్గొన్న ‘ఇస్రో’కు చెందిన సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల భాగస్వామ్యం యావద్దేశ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ‘చంద్రయాన్ ల్యాండర్ చంద్రతలంపై దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా ప్రధాని మోదీ నామకరణం చేయడమూ వారి స్ఫూర్తికి ప్రతీకగానే చెప్పాలి. అన్ని రంగాల వలె శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఆ సన్నివేశాన్నిబట్టి అందరూ అనుకున్నారు. కానీ, ఆశ్చర్యకరంగా దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థల ‘ఫేకల్టీ’ల (బోధన)లో మాత్రం వారు వెనుకబడి పోతున్నట్టు ఒక అధ్యయనం తేల్చింది.

‘అనేక రంగాలలో అప్రతిహతంగా దూసుకుపోతున్న మహిళామణులు ఉన్నత స్థాయిలో ఆచార్యులు (అధ్యాపకులు), పరిశోధకులు, విద్యావేత్తల స్థాయికి ఎక్కువగా ఎదగలేక పోతున్నారా?’ అంటే ‘అవున’న్న సమాధానం వస్తున్నది. కారణం, వారిలో ప్రతిభా పాటవాలు లేక కాదు. ఆర్థిక వనరుల కొరత, కుటుంబాలలో వివక్ష వంటివి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో టీచర్లుగా పెద్ద ఎత్తున రాణిస్తున్న మహిళలు ఉన్నత విద్యావేత్తల స్థితికి అత్యధిక సంఖ్యలో చేరుకోవడం లేదని ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్ (స్టెమ్‌ః ఎస్‌టీఈఎం) కు చెందిన వివిధ విభాగాలలో అధ్యాపక వృత్తులలో మాత్రం మహిళలు బాగా వెనుకబడి పోతున్నట్టు తేలింది. 

అగ్రదేశాలకన్నా అత్యల్పం

ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అమెరికా, బ్రిటన్‌లలోనూ మహిళా అధ్యాప కులు తక్కువగానే ఉంటున్నప్పటికీ భారతదేశంలో వీరి సంఖ్య మరింత అల్పస్థాయి లో వున్నట్టు తెలుస్తున్నది. ప్రత్యేకించి విజ్ఞానశాస్త్ర (సైన్స్) రంగంలో అధ్యాపక వృత్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగేలా కృషి చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘బయాస్ వాచ్‌ఇండియా’ బృందం ఇటీవల జాతీయ స్థాయిలో జరిపిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకర అంశాలు వెల్లడయ్యాయి.

కేవలం 13.5 శాతం మంది మాత్రమే భారతీయ మహిళలు ‘స్టెమ్’ ఫేకల్టీ (అధ్యాపక వృత్తి)లో వున్నారని తెలిసింది. ముఖ్యంగా ఐఐటీలు, ఐఐఎస్‌లలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నట్టు నిపుణులు వెల్లడించారు. ‘కమ్యునికేషన్స్ బయాలజీ’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన వివరాలనుబట్టి మన దేశంలోని మొత్తం 98 విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో బోధనా రంగంలో వున్న అధ్యాపకుల సంఖ్యపై పరిశోధన జరగ్గా, మహిళల భాగస్వామ్యం అత్యల్ప స్థాయిలో వున్నట్టు తేలింది. 

ముఖ్యంగా మహిళల్లో ఈ మేరకు ‘స్టెమ్’ కోర్సుల అధ్యయనం పట్లనే తగిన అవగాహన కొరవడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాలలో ఉన్నత చదువులు అభ్యసించి, ఫేకల్టీలో స్థిరపడటానికి కుటుంబాల పరంగా చాలామందికి నిధుల కొరత, వివక్షాయుత ధోరణి వంటివి కొంతవరకు కారణమవుతున్నట్టు వెల్లడైంది. ఈతరం ఆడపిల్లలు ఎక్కువగా సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ కోర్సులవైపు ఆకర్షితులవుతున్నారు. పెళ్ళిళ్లు, పిల్లలు, సంసార జంఝాటాలలో పడి చాలామంది ఉన్నత హోదాలకు చేరుకోకుండానే వృత్తికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ప్రత్యేకించి స్కూలు స్థాయిలో కనిపించేంత ఉత్సాహం మహిళల్లో కాలేజీలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధనా రంగంలోకి ప్రవేశించే విషయంలో అగుపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగో వంతుకన్నా తక్కువ

భారతీయ విజ్ఞానశాస్త్ర (సైన్స్) రంగం లో నిజానికి మహిళల పాత్రకు కొదువేమీ లేదు. 1930లో చెరుకులో హైబ్రిడ్స్‌ను అభివృద్ధి పరచిన వృక్షశాస్త్రవేత్త జానకి అమ్మాల్ నుంచి 2011లో ‘అగ్ని మిసైల్ తొలి ప్రయోగాత్మక పరీక్షకు నాయకత్వం వహించిన టెస్సీ థామస్ వరకు అనేకమంది పాదముద్రలు చరిత్రలో మనకు ఘనంగా దర్శనమిస్తాయి.

అయినప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగవలసిన అవసరం బాగా ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. నాలుగో వంతు కూడా లేకుండా, అత్యల్ప సంఖ్యలోనే (కేవలం 13.5 శాతం మంది) మహిళా అధ్యాపకులు, ఆచార్యులు మాత్రమే ఆయా ఉన్నత శ్రేణి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఫేకల్టీల్లో కొనసాగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

టాప్ ర్యాంకింగ్‌లో వున్న ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్‌లు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చి (టీఐఎఫ్‌ఆర్) వంటివాటిల్లో మహిళా అధ్యాపకుల భాగస్వామ్యం చాలా తక్కువగా వుంటున్నట్టు పై పరిశోధనా పత్రం వెల్లడించింది. బోధనల్లోనేకాదు, ఉన్న కొద్దిమంది కూడా ఆయా ప్రాంతాలలో జరిగే ‘స్టెమ్’ సమావేశాలకు హాజరు కావడం పట్ల కూడా వారు పెద్దగా ఉత్సాహం చూపడం లేదని తెలుస్తున్నది.

గ్రామాలు, పట్టణాల స్థాయిల్లో టీచర్లుగా చేరడానికి కనబరిచే ఆసక్తి నగరాలు, మహానగరాలలో ఫేకల్టీలలో ఉన్నత ఉద్యోగాలకు చేరుకొనే క్రమంలో వారు చూపించలేక, చెప్పుకోదగ్గ రీతిలో వెనుకబడి పోతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. సైన్సు విభాగాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం దేశ వ్యాప్తంగా ఎంతో ఉన్నట్టు ‘బయాస్ వాచ్‌ఇండియా’ వ్యవస్థాకులు శ్రుతి మురళీధర్, వైష్ణవీ అనంత నారాయణన్‌లు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

పరిశోధకులూ కావాలి మరి!

పై అధ్యయనం కోసం 2020 జూన్ నుంచి 2021 డిసెంబర్ వరకు ఏడాదిన్నర కాలం పాటు దేశవ్యాప్తంగాగల మొత్తం 98 విశ్వవిద్యాలయాలు, ఉన్నతశ్రేణి విద్యాసంస్థలలో కొనసాగిన అధ్యాపకులకు చెందిన సమాచారాన్ని ఆయా అధికారిక వెబ్‌సైట్స్ నుంచి పై పరిశోధకులు సేకరించారు. అలాగే, మొత్తం 417 సమావేశాలకు హాజరై, ఆయా సందర్భాలలో ప్రసంగించిన, పరిశోధనా పత్రాలను సమర్పించిన మహిళా ఫేకల్టీ, విద్యావేత్తలను గురించి కూడా వారు ఇందులో భాగంగా అధ్యయనం చేశారు. ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెలువడిన మహిళా ఫేకల్టీల అధ్యయన పత్రాల ప్రకటనలను కూడా పరిశోధకులు పరిశీలించారు. కెరీర్ ప్రారంభంలో కొంత ఎక్కువ సంఖ్యలోనే మహిళా భాగస్వామ్యం కనిపించినా ఉన్నత స్థాయికి చేరుకొనే క్రమంలో వారి సంఖ్య తగ్గుతున్నట్లు గుర్తించారు.

ఇంజినీరింగ్‌లో మరింత తక్కువ

ఇంజినీరింగ్ ఫేకల్టీలో అయితే కేవలం 9.2 శాతం మాత్రమే మహిళా అధ్యాపకులు కొనసాగుతున్నట్టు పరిశోధనా పత్ర రచయితలు తెలిపారు. జీవశాస్త్ర విభాగంలో మాత్రం అత్యధిక శాతం (25.5) ఫేకల్టీ భాగస్వామ్యం కొనసాగుతున్నట్టు గుర్తించారు. పై పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇంజినీరింగ్, మేథమేటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీలతో పోల్చినప్పుడు బయాలజీ (జీవశాస్త్రం)ని మహిళలు ఒక ‘సాఫ్ట్ సైన్స్’గా భావిస్తున్నట్టు వారు వివరించారు.

ఇంజినీరింగ్ తర్వాత కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ ఫేకల్టీలలో మరీ అధమస్థాయి (11.5%, 12.2%, 13%) లో మహిళా అధ్యాపకుల భాగస్వామ్యం కొనసాగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ఒక రకంగా ఎర్త్ సైన్సెస్, మేథ్స్ ఫేకల్టీలలో కొంత ఎక్కువ సంఖ్య (14.4%, 15.8%)లో మహిళా అధ్యాపకులు కొనసాగుతున్నారు. ఇదే అమెరికా విషయానికి వచ్చేసరికి,  ఫిజిక్స్‌లో 16%, ఇంజినీరింగ్‌లో 16.5% మేథమేటిక్స్‌లో 25% మహిళా భాగస్వామ్యం కొనసాగుతున్నది. అగ్రరాజ్యంలో బయాలజీ, కెమిస్ట్రీలో చాలావరకు మెరుగ్గా (46%, 40%) మహిళలు ఫేకల్టీల్లో వున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

దోర్బల బాలశేఖరశర్మ