10 March, 2026 | 4:11 AM

మహిళలు అథ్లెటిక్స్‌లో రాణించాలి – డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత కుమారి

09-03-2026 02:03 PM

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ శ్రీనివాస్ కాలనీ లోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపికల పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్( Kothagudem Municipal Corporation Deputy Mayor) సిరిపురం లలిత కుమారి హాజరై ఒలింపిక్ జెండాను ఊపి పరుగు పందెం పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అథ్లెటిక్స్‌లో పురుషులతో పాటు మహిళలు కూడా చురుకుగా పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు వందమంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ఎండను కూడా లెక్కచేయకుండా క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం అభినందనీయం అని పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో సీఎం కప్ సాధించి రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచిందని గుర్తుచేసిన ఆమె, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరును దేశవ్యాప్తంగా నిలబెట్టాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహీధర్ మాట్లాడుతూ, ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 15వ తేదీన హన్మకొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ పోటీలను జిల్లా అథ్లెటిక్స్ కోచ్ పి. నాగేంద్ర ఆధ్వర్యంలో పీటీలు ఎర్రయ్య, శ్వేతా నిర్వహించారు.