25 June, 2026 | 1:12 AM

బీజేపీ కుట్రలను అడ్డుకోవాలి

25-06-2026 12:23 AM
  1. ‘సర్’ పట్ల అప్రత్తంగా ఉండాలి
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, జూన్ 24(విజయక్రాంతి): దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. బుధవారం సంగారెడ్డి నియోజకవర్గంలోని 282 మంది బీఎల్‌ఏలు, ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులకు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ‘సర్’ ప్రిక్రియపై దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల సవరణపై అందరు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీదేనని కార్యకర్తలకు తెలిపారు. మళ్లీ జూలై 6న ఈ విషయంపై లోతుగా చర్చిద్దామన్నారు. ‘సర్’ ప్రక్రియ ముగిసేవరకు నాలుగుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు.

మీకు ఇచ్చిన కార్డులు జాగ్రత్తగా కాపాడుకోవాలని, మీ పని తీరు ఆధారంగానే ఈ గుర్తింపు ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా రాహుల్‌గాంధీ కావడానికే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఏం చెబితే ఎన్నికల కమిషన్ అది చేస్తుందని విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు కారణంగా బీజేపీ అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. అందుకే రాహుల్ గాంధీ అప్రమత్తమై ఈ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు.

దేశంలో 543 ఎంపీలలో 300 మంది కాంగ్రెస్ గెలిస్తేనే రాహుల్ ప్రధాని అవుతారని తెలిపారు. ప్రజల పక్షాన రాహుల్ గాంధీ పార్లమెంట్ కోట్లాడుతున్నారని, కానీ రాహుల్ ప్రధాని అవుతేనే ఈ ఓట్ల పంచాయతీకి ముగింపు ఉంటుందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ గెలవాలని, అప్పుడే దుర్మార్గమైన పాలన ఆగిపోతుందన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, పార్లమెంట్ ఇన్‌చార్జి ప్రీతం, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.