30 June, 2026 | 11:02 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు

28-06-2025 12:38 AM

నీటి సమస్య పరిష్కరించాలని కోరిన మహిళలు 

కామారెడ్డి జిల్లా గురు రాఘవేంద్ర కాలనీ మహిళల ఆందోళన

కామారెడ్డి, జూన్ 27,(విజయ క్రాంతి) : తలాపున నీళ్లున్నా గొంతులు తడారట్లేదు.. వర్షాకాలం వచ్చినప్పటికీ తాగునీటి గోస తప్పట్లేదు.. దీంతో తాగునీటి కోసం మహిళలు రోడ్ ఎక్కారు. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీ మహిళలు నీటి కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు.

అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు.  కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి  గ్రామ పంచాయతీ పరిధిలోని గురురాఘవేంద్ర కాలనీలో  ఈ పరిస్థితి నెలకొంది. దీంతో కాలనీవాసులంతా శుక్రవారం ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నీళ్లు కావాలని నినదించారు.

 వాటర్ ట్యాంక్‌లో నీళ్లున్నాయ్..

విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే.. ప్రస్తుతం చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ ఉంది. దాంట్లో పుష్కలంగా నీళ్లున్నాయి. కానీ కాలనీవాసులకు నీళ్లు మాత్రం అందట్లేదు. దీంతో అపార్ట్‌మెంట్లలో ఉన్న ప్రజలకు నీళ్లు రావట్లేదు. ఈ విషయమై రెండు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి తెలియజేసినప్పటికీ నామమాత్రంగానే స్పందిస్తున్నారే తప్ప నీటి సమస్యను పరిష్కరించట్లేదని కాలనీవాసులు వాపోయారు.

 రోజువారి పనులకు ఇబ్బందే

వాటర్ ట్యాంక్‌లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ట్యాంక్ నుంచి ఇళ్లలోకి నీళ్లు సరఫరా చేసే వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా కాలనీవాసులకు నీళ్లు అందట్లేదు. ఉద్యోగస్తులకు, రోజూ వారి పని చేసుకునే వారికి ఉదయం నీళ్ల కోసం ఎదురుచూసి అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు.  నీళ్లు లేక ఏ పని చేయడానికి కుదరట్లేదని వారంటున్నారు.

ఇకనైనా అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతూ.. పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పంచాయతీ సెక్రెటరీని వివరణ కోరగా పైప్ లైన్ జామ్ కావడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. పైప్ లైన్ కోసం సిబ్బంది పనులు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల్లో నీటి సరఫరా చేస్తామని కార్యదర్శి పేర్కొన్నారు.