మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు టౌన్, మే 27 (విజయక్రాంతి): మహిళా సాధికారత, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోరం కనకయ్య అన్నారు. బుధవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 500 గ్యాస్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఐదు లక్షల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండేల రాజు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






