calender_icon.png 18 July, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం సభ

18-07-2025 06:48:19 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): శుక్రవారం సభ వేదికగా మహిళలకు కావలసిన అన్ని రకాల సహాయం, సమాచారం ఇస్తున్నామని, వారి సమస్యకు పరిష్కార మార్గం చూపుతున్నామని  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ నగర్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ... శుక్రవారం సభ ద్వారా మహిళల హక్కులు, చట్టాలు వారికి ఉన్న సదుపాయాలు, సౌకర్యాలను అధికారులు తెలియజేస్తారన్నారు. మహిళలకు ఉన్న ప్రభుత్వ పథకాల గురించి కూడా విషయాలను ఇక్కడ అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

ముఖ్యంగా మహిళలకు శుక్రవారం సభలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని పేర్కొన్నారు. ప్రతి నెలా బిపి, షుగర్ మాత్రలు అవసరమయ్యేవారు శుక్రవారం సభలో ఏర్పాటు చేసే మెడికల్ క్యాంపులో ఉచితంగా పొందవచ్చని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, 40 రకాల పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఈ పరీక్షల్లో ముందుగానే గుర్తించి నయం చేయవచ్చని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందాలని, అవసరమైతే వ్యాధి తీవ్రతను బట్టి ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసి పది లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని, అక్కడ బలవర్ధకమైన ఆహారంతో పాటు చక్కటి పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం అంగన్వాడి చిన్నారులకు డ్రాయింగ్ బుక్స్, పలకలు అందజేశారు.