18-07-2025 06:43:41 PM
గన్నేరువరం మండలంలో 442 కొత్తరేషన్ కార్డులు
ఆర్డీవోతో కలిసి కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
గన్నేరువరం,(విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎందుకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదో ప్రజలు ఆలోచించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ పదేళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేని వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ చేయరు, లేనప్పుడు మోకాలొడ్డుతున్నారని బీఆర్ఎస్ తీరును ఆయన తప్పుబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
గత పాలకులు పట్టించుకోని కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలుపరుస్తున్నదని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులకు పథకాలు వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు. ఆరు గ్యారెంటీ హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలండర్, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి హామీలు నెరవేర్చగా, ఇప్పుడు తాజాగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. గన్నేరువరం మండలానికి తొలి దశలో 226 కార్డులు, రెండో దశలో 216 కార్డులు వెరసి 442 కొత్త రేషన్ కార్డులు మంజూరవడమే కాకుండా 1193 మంది పేర్లను అదనంగా కార్డుల్లో నమోదు చేయించామని ఎమ్మెల్యే వివరించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందున కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.