మహిళా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 25 (విజయ క్రాంతి): ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తరావుతో కలిసి మహిళా వారోత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సాధికారత, బాలికల సంక్షేమం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి లక్ష్యంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 25న గ్రామ సంఘాలు, మండల సమాఖ్య భవనాల భూమిపూజలు, శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రుల కోసం వంటల పోటీలు నిర్వహించాలని సూచించారు.26న బాల్య వివాహం బ్రతుకు ఆగం నినాదంతో బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, 27న మహిళల భద్రత, పోష్ చట్టంపై అవగాహన కల్పిస్తూ మండల సమాఖ్యల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
29న రుణమేళాలు నిర్వహించి స్వయం సహాయక సంఘాల జీవనోపాధి యూనిట్లను ప్రారంభించాలని, 30న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం కింద అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ, విద్యా ఆరంభ ధ్రువపత్రాల జారీ, కిశోర బాలికల కోసం స్నేహ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.మహిళా వారోత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






