బీసీలను లెక్కలోకి తీసుకోరా?
భారతదేశంలో 1881లో లార్డ్ రిప్పన్ కాలంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. నాటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం దేశంలో జనాభా లెక్కలను సేకరించే ఆనవాయితీ కొనసాగుతున్నది. కానీ, 2019లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం వలన భారత ప్రభుత్వం 2021లో జనాభా లెక్కల సేకరణని కొనసాగించలేకపోయింది. 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం జనగణనలో భాగంగా జాతి ఆధారిత కులగణన కూడా చేపట్టింది.
కానీ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 నుంచి 2011 వరకు 7 పర్యాయాలు చేపట్టిన జనగణనలో కులాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభాను మాత్రమే గణిస్తున్నారు. మెజారిటీ వర్గాలైన ఇతర వెనుకబడిన తరగతుల జనాభాను (ఓబీసీ) మాత్రం లెక్కించటం లేదు. దేశంలో జంతువులకు, వన్య ప్రాణులకు, అడవులకు, చెట్లకు, నదులకు, నీళ్లకు లెక్కలు ఉన్నాయి. కానీ, ఓబీసీలను ఎందుకు లెక్కించరనే ప్రశ్నలకి మాత్రం సమాధానం చెప్పకుండా ప్రభుత్వాలు ఏడు దశాబ్దాలుగా దాటవేస్తూనే ఉన్నాయి.
జనగణనలో భాగంగా జాతి ఆధారిత కులగణన చేపట్టాలని విపక్ష రాజకీయ పార్టీల నుంచి, వెనుకబడిన తరగతుల నుంచి వస్తున్న డిమాండ్‌కి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన చేపడతామని 2025లో ప్రకటించింది. కానీ, జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిలో ఓబీసీలకి సంబంధించిన కాలమ్ లేకపోవటంతో దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.
హామీ ఇచ్చి విస్మరిస్తారా!
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణనలో భాగంగా జాతి ఆధారిత కులగణన చేపట్టకపోవటాన్ని వెనుకబడిన తరగతులు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. కుల గణన చేయాలనే డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నాయి. కులగణన కోసం వెనకబడిన తరగతులు చేస్తున్న ఒత్తిడి ఫలితంగా రాజకీయ అవసరాల కోసం, ఓబీసీల మద్దతు కోసం నాటి యూపీఏ ప్రభుత్వం 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణలో సామాజిక- ఆర్థిక- కులగణన (ఎస్‌ఈసీసీ) చేపట్టినా, కులాల గణన సేకరణ సందర్భంగా దరిదాపు 46 లక్షల తప్పులు దొర్లాయని ఆ జనాభా లెక్కలలోని కులాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టడానికి ప్రభుత్వాలు నిరాకరించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బలమైన బీజేపీని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పాంచ్ న్యాయలో భాగంగా హిస్సే దారి (భాగీదారి) న్యాయని ప్రకటించారు.
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జనగణనలో కులగణన చేపడతామని, అది వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎక్స్- రే లాగా ఉపయోగపడుతుందని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి ‘ఉత్నే ఆబాది జిత్నే భాగీదారి’ (ఎవరు ఎంతో వారికంత వాటా)ని విస్తృతంగా ప్రచారం చేశారు. కులగణన చేపడతామనే హామీ కాంగ్రెస్‌కి రాజకీయంగా బాగా కలిసి వచ్చింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా 2024లో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలలో విజయం సాధించడమే కాదు, రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సాధారణ మెజార్టీని కూడా సాధించలేకపోయింది.
కులగణన ప్రచారంతో కాంగ్రెస్‌కి బలం పెరిగిన నేపథ్యంలో కులాలుగా విడిపోతే హిందుత్వం బలహీనపడుతుందనే ఆలోచన నుంచి బయటపడిన ఆర్‌ఎస్‌ఎస్ కేరళలో జరిగిన సమావేశంలో తాము కులగణనకి వ్యతిరేకం కాదని ప్రకటించింది. బీజేపీ కూడా తన వైఖరిని మార్చుకొని 2026 నుంచి జరిగే జనగణనలో కులగణన చేపడతామని ప్రకటించి వెనుకబడిన వర్గాల మద్దతుతో హర్యానా, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా భారీ విజయాలను నమోదు చేసుకుంది.
మొదటి దశ జనగణనలో భాగంగా హెచ్‌ఎల్‌ఓలలో ఓబీసీల ప్రస్తావన లేదు. రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ కోసం ఆగస్టు 14న విడుదల చేసిన 40 ప్రశ్నలతో కూడిన జాబితాలో కూడా ఎక్కడా ఓబీసీల ప్రస్తావన లేదు. 8వ ప్రశ్నలో జాతీయతని, తొమ్మిదవ ప్రశ్నలో మతాన్ని, పదవ ప్రశ్నలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రశ్నలను పొందుపరిచారు. కానీ, ఓబీసీలకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడంతో కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందనే అభిప్రాయాలు ఓబీసీల నుంచి వ్యక్తమవుతున్నాయి.
2011లో 29 ప్రశ్నలతో జనాభా లెక్కలను సేకరించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి కొవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ వేసుకున్నారనే ప్రశ్నతో పాటు 10 ప్రశ్నలను అదనంగా పొందుపరిచింది. ఆ ప్రశ్నల జాబితాలో ఒబీసీల ప్రస్తావన లేకపోవడం వెనుకబడిన తరగతులను నిరాశపరిచింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కల కోసం యూనిక్ కోడ్ ఇచ్చిన ప్రభుత్వం ఓబీసీ కులాలకు సంబంధించి కేంద్ర జాబితాలో, రాష్ట్రాల జాబితాలో వైరుధ్యాలు ఉన్నాయనే నెపంతో డ్రాప్ డౌన్ పద్ధతిని పాటించకుండా ఓపెన్ కాలంలో ఓపెన్ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించింది. అంటే సరైన లెక్కలు తీయకుండా ఓబీసీలకు అన్యాయం చేసినట్లుగానే భావించాలి.
ఈ వివక్ష ఎందుకు?
దేశంలో ఉన్న 147 కోట్ల జనాభాలో మెజార్టీ ప్రజలైన ఓబీసీలు తాము ఎంత ఉన్నామో, తమ స్థితిగతులు ఏమిటో? విద్య, ఆర్థిక అంశాలలో రాజకీయ అవకాశాలలో దక్కిన వాటా ఏమిటో? తెలుసుకోవాలని అనుకుంటున్నారు. వారికి ఆ హక్కు ఉన్నది. మెజార్టీ ప్రజల స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా ప్రభుత్వం తన విధానాలను ఎలా రూపొందిస్తుంది? లక్ష్యాలను ఎలా నిర్ణయించుకుంటుంది? వికసిత్ భారత్ వైపుకి ఎలా అడుగులు వేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాలు దశాబ్దాలుగా వివక్ష చూపుతూనే ఉన్నాయి.
ఓబీసీల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే మండల్ కమిషన్ నివేదికను పూర్తిగా అమలు చేసే వారే కదా! 1980లోనే ఓబీసీల సమగ్ర అభివృద్ధి కోసం కులగణన చేపట్టాలని తన నివేదిక లో మండల్ స్పష్టం చేశారు కదా! అలాంటప్పుడు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కులగణన చేపట్టడానికి ఎందుకు ముందుకురాలేదు? 2022లో బీహార్ ప్రభుత్వం, 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయగలిగాయి కదా! మరి కేంద్ర ప్రభుత్వానికి కులగణన పట్ల ఉన్న అభ్యంతరాలు ఏమిటి? ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన పనిని కేంద్ర ప్రభుత్వం చేయలేదా! ఓబీసీల పట్ల వారికి ఉన్న సవతి తల్లి ప్రేమ మాత్రమే వారిని కులగణన చేపట్టకుండా అడ్డుపడుతుందనే భావన కలగకమానదు.
కులగణన అంటే జనాభాని కులాలవారీగా విభజించి లెక్కించే క్వాంటిటేటివ్ ప్రక్రియ కాదు, వారి స్థితిగతులను తెలుసుకునే ఒక క్వాలిటేటివ్ ప్రక్రియగా భావించాలి. కులగణన తర్వాతే కదా 34 శాతం బిహారీల రోజువారి ఆదా యం కేవలం 200 రూపాయలు అని తేలిం ది, తెలంగాణ రాష్ట్రంలోని 134 బీసీ కులాలలో 69 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిసింది.
కాబట్టి కులగణన తరువాత ఆయా వర్గాల వెనకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకోటానికి, లక్ష్యాలను నిర్దేశించుకోటానికి, బడ్జెట్ కేటాయింపులకి, పథకాలను రూపొందించడానికి, రిజర్వేషన్లను మరింత హేతుబద్ధంగా అమలు చేయటానికి అవకాశం కలుగుతుంది. జనగణనలో కులగణన చేపట్టాలని డ్రాప్ డౌన్ పద్ధతిలో ఓబీసీ లెక్కలు కూడా చేపట్టాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధానికి లేఖ రాశారు.
లేఖలతోనే సరిపెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓబీసీలకి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోటానికి దక్కిన అవకాశంగా జనగణనలో కులగణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలి. మొదటిసారి పేపర్ లెస్‌గా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేపడుతున్న సెన్సస్ ఎన్యూమరేషన్‌లో ఓబీసీల గణనలో ఎదురయ్యే సమస్యలను సులువుగా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో వెనుకబడిన వర్గాల అభీష్టం మేరకు ప్రభుత్వం జనాభా లెక్కల ప్రశ్నావళిలో ఓబీ సీ కాలమ్ కూడా చేర్చుతుందని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877
డా.తిరునహరి శేషు






