30 August, 2026 | 1:36 AM

మంచు సరస్సులతో మనకూ ముప్పు

30-08-2026 12:00 AM

ప్రకృతి విరుద్ధంగా మానవాళి ప్రవర్తించినప్పుడు చెల్లించాల్సిన మూల్యం ఎంత దారుణంగా, విధ్వంసకరం గా ఉంటుందో చెప్పడానికి హిమాలయ పర్వత శ్రేణుల్లో సంభవిస్తున్న ఆకస్మిక పరిణామాలు నిదర్శనంగా మారుతున్నాయి. హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని, మానవాళి మనుగడకే తీవ్ర ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు.

అయినప్పటికీ పాలకులు, ప్రభుత్వాలలో చలనం రావడం లేదు. తాజాగా టిబెట్ నేపాల్ సరిహద్దులోని త్రిశూలి నదీ పరివాహక ప్రాంతంలో నూతనంగా ఏర్పడిన గ్లేషియల్ సరస్సు బరస్ట్ అయ్యే ప్రమాదం ఉందని చైనా హెచ్చరించడం ప్రపంచ దేశాలను తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. పర్వతాల పైభాగంలో మంచు సరస్సులు ఏ క్షణంలోనైనా పేలిపోవడం వల్ల నీరు, రాళ్లు, రప్పలు కొట్టుకొచ్చి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది గల్లంతు కావడం అనేది రాబోయే పెద్ద విపత్తుకు ఆరంభం మాత్రమే. ఈ భయానక పర్యవసానాలకు ముగింపు పలకాలంటే అసలు విపత్తు మూలాలను, భూగోళం వేడెక్కుతున్న తీరును, పర్వత ప్రాంత వ్యవస్థను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రమాదకర స్థితిలో భారత్

ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే హిందూ కుష్ హిమాలయ ప్రాంతం అత్యంత వేగంగా వేడెక్కుతోందని శాస్త్రీయ అధ్యయనాలు గతంలోనే నిరూపించాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే, హిమాలయ పర్వత ప్రాంతంలో అది అదనంగా మరో 0.3 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానున్నది. ఒకవేళ ఉద్గారాల తీవ్రత ఇలాగే కొనసాగితే, ఈ శతాబ్దం చివరి నాటికి హిమాలయ పర్వత ప్రాంత ఉష్ణోగ్రతలు 2.5 నుంచి 5.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదకర స్థితిలోకి మనం అడుగుపెడుతున్నాం.

దీని పర్యవసానంగా గత కొన్ని దశాబ్దాల కాలంలో చల్లని రాత్రుల సంఖ్య తగ్గిపోయి, వేడి రోజులు, వేడి రాత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వాతావరణ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. పర్వత శిఖరాలపై శతాబ్దాలుగా గడ్డకట్టుకుపోయి ఉన్న మంచు పొరలు కరిగిపోవడం వల్ల పర్వతాల భౌతిక స్థిరత్వం దెబ్బతిని, కొండచరియలు విరిగిపడటం, మంచు కొండలు కూలిపోవడం లాంటి విపత్కర ఘటనలు ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి.

కరిగిపోతున్న హిమనీనదాలు

హిమనీనదాలు కరిగిపోవడం వల్ల పర్వత లోయల్లో కొత్తగా వేలాది సరస్సులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి చూడటానికి ఎంత అందంగా ఉన్నప్పటికీ, నిజానికి ఇవి ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్న మంచు బాంబుల లాంటివి. గతంలో నిర్వహించిన సర్వేలో కేవలం 8,600కు పైగా గ్లేషియల్ సరస్సులు మాత్రమే ఉండగా, ఇటీవలి ఆధునిక ఉపగ్రహ సర్వేల ద్వారా ఏకంగా 25 వేలకు పైగా సరస్సులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో అనేక సరస్సులు ఇప్పటికే ప్రమాదకర స్థాయి నీటిమట్టంతో నిండిపోయి ఉన్నాయి. గతేడాది సిక్కింలోని ‘దక్షిణ లోనాక్’ గ్లేషియల్ సరస్సు పగిలిపోయి తీస్తా నదీ లోయను పూర్తిగా తుడిచిపెట్టేసిన తీరును మనం చూశాం. ఇటువంటి ప్రమాదాలు ఎంత వినాశకరంగా ఉంటాయో మన కళ్లకు కట్టినట్లు ఆ ఘటన చూపించింది.

బీహార్‌లో ముంపు అధికం

నేపాల్‌లో సంభవించే ఈ గ్లేషియల్ పరిణామాలు, చైనా పీఠభూమిలో చేపడుతున్న రకరకాల ప్రాజెక్టుల వల్ల అత్యంత ఘోరంగా దెబ్బతింటున్నది మన దేశంలోని బీహార్ రాష్ట్రమే. బీహార్ భౌగోళిక భూభాగంలో ఏకంగా 73 శాతం నదుల వరద పరీవాహక ప్రాంతంలోనే ఉంది.

భారతదేశంలో వరద ముంపునకు గురయ్యే మొత్తం జనాభాలో ఇరవై రెండు శాతానికి పైగా ప్రజలు ఒక్క బీహార్ రాష్ట్రంలోనే నివసిస్తుండటం అత్యంత కలవరపరిచే విషయం. నేపాల్ పర్వతాల్లో ఉద్భవించే కోసి, గండ్క, భాగ్మతి, మహానంద వంటి నదుల వరదలకు, ఆ నది ఉగ్ర రూపానికి బీహార్ ప్రజలు నిత్యం బలవుతున్నారు. గతంలో వచ్చిన వరదల కారణంగా బీహార్ రాష్ట్రంలో వందలాది మంది చనిపోగా, కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. 

మరోవైపు నదులకు ఇరువైపులా సిమెంట్ గండికట్టలు నిర్మిస్తే వరదలు తగ్గుతాయనుకోవడం పాలకుల అతి పెద్ద అపోహ అని చరిత్ర రుజువు చేసింది. వేలాది కిలోమీటర్ల మేర గండికట్టలు నిర్మించిన తర్వాత కూడా ముంపు ప్రాంతం తగ్గకపోగా మరింత పెరిగింది. నదీ గర్భాల్లో పూడిక చేరడం వల్ల ఈ కట్టలు తెగిపోయి ఒకేసారి వినాశకరమైన వరదలు విరుచుకుపడుతున్నాయి.

అంతర్జాతీయ పర్యావరణ సంక్షోభం

పర్వావరణ అధ్యయనాల ప్రకారం ఇండో- గంగా మైదానంలో నైరుతి రుతుపవనాల సగటు వర్షపాతం ఏటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ, తక్కువ సమయంలోనే ఆకస్మికంగా కురిసే అత్యంత భారీ వర్షాల సంఖ్య కొంతకాలంగా గణనీయంగా పెరుగుతున్నది. పర్వతాల్లో మంచు కరగడం వల్ల కృత్రిమంగా పురుడుపోసుకుంటున్న వరద ప్రవాహాలు, భారీ వర్షాలు కలగలిసి పాతబడిన సాంప్రదాయ డ్రైనేజీ, హైడ్రాలజీ మౌలిక వసతులను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేవలం ఎత్తయిన గండికట్టలు నిర్మించడం లేదా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం ఏ మాత్రం పరిష్కారం కాదు. 

హెచ్చరిక వ్యవస్థల బలోపేతం

నీటి ప్రవాహాలు, నదుల వరదలు దేశాల సరిహద్దులను గౌరవించవు. కాబట్టి చైనా, నేపాల్, భారతదేశం తమ రాజకీయ వైరుద్ధ్యాలను పక్కనబెట్టి గ్లేషియల్ సరస్సుల నీటిమట్టాలపై ప్రత్యక్ష సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలి. అలాగే పర్వత శ్రేణులలో శాటిలైట్, ఆటోమేటెడ్ మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ప్రమాదాన్ని ముందే ఊహించి దిగువ ప్రాంత ప్రజలను ఖాళీ చేయించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను విస్తృతంగా బలోపేతం చేయాలి. ప్రకృతి ఇస్తున్న ఈ అంతిమ హెచ్చరికలను ఇప్పటికీ మానవాళి నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో మనం చవిచూసే విపత్తులు మానవ ఊహకు కూడా అందనంత భయానకంగా ఉంటాయని పాలకులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. 

వ్యాసకర్త: జర్నలిస్ట్, 9848559863

వెంకగారి భూమయ్య