రత్నాపూర్‌లో వీధి దీపాల పనుల్లో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు పనుల సందర్భంగా ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెట్టు రవి వీధి దీపాలు అమర్చే పనిలో ఉండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్ తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్ షాక్ కారణంగా స్తంభంపై నుంచి కిందపడిపోవడంతో తలకు, ఛాతీ భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖతో సమన్వయం లేకుండా, తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.






