ఘనంగా ప్రపంచ బంజారా దినోత్సవం
రంగారెడ్డి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): దేశ రాజధానిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం, ఇందిరా భవన్లో సోమవారం ప్రపంచ బంజారా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బంజారా సమాజ ఐక్యతను చాటేలా సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన నేతలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్యక్రమానికి ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు హన్మ నాయక్ విశిష్ట అతిథిగా పాల్గొని, బంజారా జాతి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో ఎంపీ పోరిక బలరాం నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు S. రాములు నాయక్, ఏఐసీసీ జాతీయ నాయకులు బేల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన బంజారా, లంబాడా, సుగాలి నేతలు పాల్గొన్నారు.




