1 August, 2026 | 6:42 PM

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం

01-08-2026 06:08 PM

- ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

- చిన్నారులకు అన్నప్రాసన, తల్లిపాలు, పౌష్టికాహారంపై అవగాహన

గంభీరావుపేట,(విజయక్రాంతి): తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమూల్యమైన వరమని సర్పంచ్‌లు రాజబోయిన అర్చన, ఉమ్మారెడ్డి విమల, ఎర్రం లతికలు పేర్కొన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం  నర్మాల, గజసింగవరం, గోరంటల గ్రామాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్లు జి. కళావతి, స్వరూప ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలకు తల్లిపాలు, పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నపాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ... పుట్టిన శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని తెలిపారు.

తల్లిపాలు శిశువును విరేచనాలు, న్యూమోనియా వంటి వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు మేధాశక్తి పెంపుకు దోహదపడతాయని వివరించారు.అలాగే తల్లిపాలు బిడ్డకు భవిష్యత్తులో రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధులు రాకుండా నిరోధించడంలో సహాయపడతాయని తెలిపారు. క్రమంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గడమే కాకుండా అదనపు బరువు తగ్గించుకోవడంలో కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. తల్లి-బిడ్డల మధ్య ప్రేమ, ఆత్మీయత పెంపుకు తల్లిపాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు.