1 August, 2026 | 7:11 PM

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం

01-08-2026 06:18 PM

అచ్చంపేటలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

అచ్చంపేట: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అచ్చంపేట మున్సిపల్ పరిధిలోని 10వ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంగన్‌వాడీ సూపర్వైజర్ సువర్ణ గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిశువులకు డబ్బా పాల కంటే తల్లిపాలే అత్యంత శ్రేయస్కరమని పేర్కొన్నారు. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువుకు అవసరమైన పోషకాలు అందడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలనే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలను ప్రోత్సహించడం ద్వారా శిశు మరణాలను తగ్గించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని వివరించారు. అనంతరం 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల తల్లులకు గుడ్లు, బాలామృతం, పౌష్టికాహార కిట్లు, అంగన్‌వాడీ ద్వారా అందించే ఇతర పోషకాహార పదార్థాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హబ్బు వెంకటమ్మ, అంగన్‌వాడీ టీచర్ సంధ్య, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విశేష స్పందన పొందింది.