సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హన్మకొండ,(విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హనుమకొండ జిల్లాలో వైద్య ఆరోగ్య, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిబిరం,యోగ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హాజరై ప్రారంభించి, స్వయంగా యోగాసనాలు చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, మన దేశంలో పుట్టిన యోగా విధానం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రాముఖ్యత పొందిందన్నారు. యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. లండన్ వంటి విదేశీ నగరాల్లో కూడా చిన్నారులకు వారానికి ఒక రోజు యోగా తరగతులు నిర్వహించడం జరుగుతుండటం, యోగా ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చని తెలిపారు.
ప్రత్యేకంగా మహిళలు, ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా యోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని, మందులపై ఆధారపడే అవసరం తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు.హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానీమన్ జయంతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా వడ్డేపల్లి పార్క్‌లో ఆ మహనీయుని చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉచిత హోమియో, ఆయుర్వేద వైద్య సేవలతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఈ శిబిరాన్ని కార్పొరేటర్ దాస్యం అభినయ భాస్కర్ ప్రారంభించగా, డిఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య ఆయుష్ వైద్య సేవల విశిష్టతను వివరించారు.అనంతరం వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా హోమియో, ఆయుర్వేద మందులను అందజేశారు.ఈ శిబిరంలో మొత్తం 453 మంది రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభినవ్ భాస్కర్, ఆయుష్ జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ ఎస్. మహేంద్ర కుమార్ , జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భాను కుమార్,డిఎం హెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డిపిఆర్ ఓ ఆయుబ్ అలీ, వైద్యులు డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, డాక్టర్ రజిత, డాక్టర్ శోభ, డాక్టర్ కిరణ్ కుమార్, ఫార్మసిస్ట్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.




