బేలలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
బేల, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని(World Tribal Day celebrations ) ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయి సెంటర్ మండల అధ్యక్షులు కొరంగె సోనేరావ్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు.
నేటికీ ఆదివాసీల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా పీసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, దీంతో ఆదివాసీలకు కల్పించిన హక్కులు, గ్రామసభ అధికారాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.






