05-07-2025 12:44:18 AM
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 4 (విజయక్రాంతి): చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ చేతులు చచ్చుబడ్డ ఘటన పాల్వంచ పట్టణ పరిధిలోని పృధ్వీ ఆస్పత్రిలో జరిగింది. పాల్వంచ పట్టణానికే చెందిన అరుణ.. తన శరీరంలో రక్తం తక్కువ ఉన్నదని గత నెల 22వ తేదీన పృధ్వీ ఆస్పత్రిలో చేరారు. బీ విటమిన్ లోపించిందని, ఇన్ పేషంటుగా చేరి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
మూడు రోజులపాటు ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యం చేశారు. ఈ క్రమంలో చేతులకు గ్లూకోస్ బాటిల్స్ ఎక్కించడంతో లావెక్కాయి. అదేంటని ప్రశ్నిస్తే తగ్గిపోతుందంటూ సమాధానం చెప్పారు. పరిస్థితి విషమించడంతో బాధితులు కొత్తగూడెంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించగా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె రెండు చేతులూ పనిచేయడం లేదు.
రెక్కాడితే కానీ డొక్కాడని అరుణ కుటుంబం.. ఆమె టైలరింగ్ చేస్తేనే పూట గడిసేది. అలాంటి పరిస్థితిలో రెండు చేతులు చుచ్చుబడిపోవడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు పృధ్వీ ఆస్పత్రిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.