భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట
గిరిప్రదేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్టలో జనమే జనం
యాదగిరిగుట్ట, మార్చి 8 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కొండ కింద గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం5 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరసాగింది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భవాని శంకర్, ధర్మకర్త నరసింహా మూర్తి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు, ధర్మ దర్శన, ప్రత్యేక దర్శన క్యూలైన్ కాంప్లెక్సులు, ప్రసాద విక్రయ క్యూలైన్ కాంప్లెక్స్ పూర్తిగా సందడిగా మారాయి. ధర్మ దర్శనానికి రెండు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. యాదగిరి కొండ పైన తిరువీధులలో కొండ కింద రింగురోడ్డులో ఎక్కడ చూసినా జనమే జనం.. శాస్త్రోప్తంగా నిత్య పూజ్యం.. వేకువ జామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు, స్వయంభులకు నిత్య పూజలు నిర్వహించారు.
గర్భాలయంలో స్వయంభులకు అభిషేకము, అర్చన ప్రాకారమంటపంలో నృసింహ హోమం,నిత్య కళ్యాణం పర్వాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రము స్వామివారికి వెండి జోడి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో వేకువజాము నుండి రాత్రి 9:30గంటల వరకు భక్తులు బారులు తీరారు.. కొండపైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య పూజలను అర్చక స్వాములు సాంప్రదాయ భద్రంగా జరిపారు. పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారికి నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. శ్రీ స్వామివారి జన్మనక్షత్రం స్వాతి పురస్కరించుకుని నిర్వహించు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కుమారి.పి.శ్రీ వైష్ణోదేవి హైదరాబాద్ వారిచే గిరి ప్రదక్షిణ మార్గంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కూచిపూడి ముత్యం అందరినీ ఆకట్టుకుంది.




