74 ఏళ్లనాటి ‘బీదల పాట్లు’
‘బీదలపాట్లు’ సినిమా తెలుగులో రెండు సార్లు విడు దలైంది. తెలుగులో మొదటి సారి 1950లో తెరకె క్కింది. ఇందులో చిత్తూరు నాగయ్య కథానాయకుడిగా నటించారు. తర్వా త ఇదే పేరుతో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా 1972 లోనూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరో అసలు విషయం ఏమిటంటే.. తెలుగులో కన్నా ముందు ఈ సినిమా ‘ఎజై పాదుం పాడు’ పేరుతో తమిళంలో రూపొందింది. తమిళంలో తెరకెక్కించిన కే రామ్‌నాథ్ దర్శకత్వంలోనే తెలుగులోకి ‘బీదల పాట్లు’ టైటిల్‌తో అనువాదమయ్యింది. అయితే వీ నాగయ్య హీరోగా 1950లో వచ్చిన ఈ సినిమా.. 74 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే, డిసెంబర్ 9వ తేదీన విడుదలైంది. తెలుగులో పక్షిరాజ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎం శ్రీరాములు నాయుడు నిర్మాణంలో రూపొందింది.
చిత్తూరు నాగయ్య, లలిత, పద్మిని ప్రధాన పాత్రల్లో నటించగా, జీఅశ్వత్థామ, ఎస్‌ఎం సుబ్బనాయుడు సంగీతం అందించారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. ఆరుద్ర రాసిన ఈ పాటలను ఎంఎల్ వసంతకుమారి, పెరియానాయకి పాడారు. ఈ సినిమా కథను సదానంద భారతి, జవార్ సీతారామన్, విక్టర్ హ్యూగో రచించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా ఎన్ ప్రకాశ్ వ్యవహరించారు. ఎంటర్‌టైనర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో కందన్ (నాగయ్య) అనే వ్యక్తి రొట్టె దొంగిలిస్తాడు. అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. తర్వాత కందన్.. ఒక క్రిస్టియన్ బిషప్ సహాయంతో దయానిధిగా పేరు మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. గాజుల తయారీ కంపెనీని ప్రారంభించి, గొప్ప వ్యాపారిగా చెలామణి అవుతాడు.
పట్టణ మేయర్ పదవినీ అధిరోహిస్తాడు. మేయర్ దయానిధి ఎవరో కాదు.. పాత నేరస్తుడు కందన్‌నే అనే విషయం తెలిసిన ఇన్‌స్పెక్టర్ జావెర్ట్ ఆ విషయాన్ని బయటపెట్టాలని చూస్తాడు. కానీ దయానిధి ఉరఫ్ కందన్‌పై ఉన్న కృతజ్ఞతతో అధికారులకు అప్పగించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఇన్‌స్పెక్టర్ జావెర్ట్.. కందన్ పట్ల ఎందుకు కృతజ్ఞతతో వ్యవహరించడానికి గల కారణమేంటి? ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? చట్టాన్ని అనుసరించి కందన్‌ను ఉన్నతాధికారులకు అప్పగించే అవకాశం ఉన్నా, అలా చేయకుండా ఇన్‌స్పెక్టర్.. ఎందుకు తన జీవితాన్ని ముగించాడు అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.






