20 August, 2026 | 1:29 PM

మూడు చేపలు

15-06-2024 12:00 AM

ఒక పెద్ద చెరువులో మూడు చేపలు ఉండేవి. అవి ఉండే పద్ధతిని బట్టి వాటిని తెలివైనది, చురుకైనది, నిదానమైనది అని తోటి చేపలు పిలిచేవి. ఒకసారి ఆ మూడు చేపటలు ఈదుతూ ఈదుతూ చాలాదూరం వెళ్లిపోయాయి. అలా అవి ఒక పట్టణ ప్రాంతం చేరాయి. ఎంతో ప్రశాంతమైన వాతావరణం లోంచి అవి ఉరుకులు పరుగులు తీసే జనం మధ్యకు వచ్చిపడ్డాయి. 

ఆ వాతావరణం వెంటనే గ్రహించిన చురుకైన రెండో చేప తన అన్నతోనూ, తమ్ముడితోనూ తన మనసులోని మాట బయట పెట్టింది. “ఇక్కడ మన చుట్టూ చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. జాలరులు అంటే చేపలు పట్టేవాళ్లు ఈ కాలవ వొడ్డునే వలలు, గాలాలు పట్టుకుని తిరుగుతున్నారు. వాటికి మనం చిక్కామో, మనలో ఎవరం బతకం. ఇన్నాళ్లు హాయిగా బతికిన మన ఊరి చెరువుకే వెళ్లిపోదాం”. 

మిగతా రెండు చేపలు చురుకైన చేప చెప్పిన మాటలని పెద్దగా పట్టించుకోలేదు. రేపు చూద్దాంలే అంటూ బద్ధకంగా కాలం గడిపేస్తున్నాయి. వాళ్ళని వదిలి వెళ్ళలేక అది కూడా అన్నతోనూ, తమ్ముడితోనూ అక్కడే ఉండిపోయింది. 

ఒకరోజు ఈదుతూ ఈదుతూ చురుకైనచేప కన్నా మిగతావి రెండూ బాగా ముందుకు పోయాయి. చురుకైనచేప మాత్రం పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ వాటి వెనకే ఈదుతోంది. 

ముందుకు పోయిన ఆ రెండు చేపలు ఉన్నట్టుండి జాలర్ల వలలో చిక్కుకుపోయాయి. దూరం నుంచీ ఆ రెండు చేపలు వలలో చిక్కుకోవడం, చురుకైన రెండో చేప గ్రహించింది. ఎలాగైనా తమ వాళ్ళని జాలర్ల వలనుంచి కాపాడుకోవాలనుకుంది. 

చాలా ఆలోచించి జాలర్లను బురిడీ కొట్టించాలనుకుంది. జాగ్రత్తగా వల పక్కనుంచే ఈదుతూ ఒక్కసారిగా నీళ్ళలోంచి పైకి ఎగిరి పక్కకు దూకింది. క్షణం ఆలస్యం చేయకుండా ఇంకోసారి మరోపక్కనుంచి పైకి ఎగిరి నీటి లోపలకి దూసుకుపోయింది.

నీళ్ళ చప్పుడుకి జాలర్లు ఆ వైపుకు చూశారు. అంతకు ముందు వలలో పడ్డ రెండు చేపలు వలలోంచి తప్పించుకుని మళ్ళీ నీళ్ళలోకే జారిపోయాయి అనుకున్నారు. ఇక లాభం లేదనుకొని వల పూర్తిగా మూసుకుపోకముందే రెండో కొసను పట్టుకుని గట్టిగా వొడ్డుకి లాగేశారు. దాంతో ఇంకా లోపలే ఉన్న రెండు చేపలు ఇదే సందనుకుని వలలోంచి నీళ్ళలోకి జారిపోయాయి. జాలర్లు అక్కడి నుంచి కదిలి వలలు భుజానవేసుకుని వేరే చోటకి పోయారు. మొత్తానికి వలనుంచి తప్పించుకున్న రెండు చేపలూ తమను తెలివిగా తప్పించిన చురుకైనచేపను కలిసాయి. 

“నువ్వున్నట్లే మన పాత చెరువుకి పోయి వెనకటిలా హాయిగా ఉందాం”! అలా ఆ మూడు చేపలు ఒక్కమాటపై నిలిచి హాయిగా కాలం గడిపాయి.

 పిల్లల కోసం తరతరాల కథలు

పుస్తకం నుంచి.

ప్రచురణ: కావ్య పబ్లిషింగ్ హౌస్