19 April, 2026 | 10:17 AM

క్రిస్మస్ ఫ్రూట్ కేక్స్ !

24-12-2024 12:00 AM

క్రిస్మస్ అంటేనే కేకులు, స్నాక్స్, వేడుకలు, ఆత్మీయుల కలయికలు. వేడుకలయినా, ఆత్మీయుల కలయిక అయినా కేక్ లేకపోతే కష్టమే. అది కూడా క్రిస్మస్ వేళ కేక్ లేకపోతే ఎలా? మరి మీరు కూడా ఆరోజు కేక్ కట్ చేయాలనుకుంటున్నారా? అయితే.. షాపులో కొనడం ఎందుకు? ఇంట్లోనే టేస్టీ టేస్టీ సూపర్ ఫ్రూట్ కేక్స్ మీకు నచ్చిన ఫ్లేవర్‌లో మీరే సూపర్ కేక్ రెడీ చేయండి. ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్‌ను ఎంజాయ్ చేయండి.! 

పియర్ కేక్..


కావాల్సిన పదార్థాలు: మూడు గుడ్లు, 150 గ్రాముల బ్రౌన్ షుగర్, 75 మిల్లీలీటర్ల ఆలీవ్ ఆయిల్, ఒక చెంచా దాల్చిన చెక్క, అర స్పూన్ లవంగాలు, ఒక వెనిల్లా బీన్స్, 170 గ్రామ్స్ సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్, 50 గ్రాముల ఆల్మండ్ మీల్, వందగ్రాముల ఆల్మండ్ మీల్క్, 50 గ్రాముల ఎండు ద్రాక్ష, మూడు కొరెల్లా బేరి, బోస్క్, దాల్చిన చెక్క, చక్కెర. 

తయారీ విధానం: ఓవెన్‌ని 180 డిగ్రీలకు వేడి చేయండి. 25 సెంటిమీటర్ల కేక్ టిన్‌లో కొద్దిగా నూనె వేసి.. పిండితో డస్ట్ చేయాలి. గుడ్లని కొట్టి అందులో చక్కెర వేసి బాగా కలపాలి. ఆలీవ్ ఆయిల్, మిగతా ఐటమ్స్, వెనిల్లా, పిండి, ఆల్మండ్ మీల్ వేయాలి. తర్వాత బాదం మిల్క్ వేసి పిండిని జారుడుగా కలపాలి. ఈ పూర్తి మిశ్రమాన్ని కేట్ టిన్‌లో పోసి 35 నిమిషాలు గోల్డెన్ రంగు వచ్చే వరకూ బేక్ చేసుకోవాలి. తర్వాత రూమ్ టెంపరేచర్ వద్ద 20 నిమిషాలు చల్లబరచుకోవాలి. పూర్తిగా చల్లారక తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. 

డ్రై ఫ్రూట్స్ కేక్..


కావాల్సిన పదార్థాలు: వెన్న ఒక కప్పు, చక్కెర ఒకటిన్నర కప్పులు, గుడ్లు ఆరు, బాదం ముక్కలు 125 గ్రాములు, వెనీలా ఎసెన్స్ రెండు చుక్కులు, డ్రై ఫ్రూట్ మిక్స్ (ఎండు ద్రాక్ష, చెర్రీ) సగం కప్పు, మైదా పిండి రెండు కప్పులు. 

 తయారీ విధానం: ఇందుకోసం పండ్లు, బాదం ముక్కలని రెండు చెంచాల మైదా పిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెన్న, చక్కెర, గుడ్లు, వెనీలాను బాగా కలపాలి. ఆ తర్వాత మైదాపిండిలో వేసి, ఆ తర్వాత ఫ్రూట్ మిక్సర్‌ను మిక్స్ చేయాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని బేకింగ్ టిన్‌లో వేసి, అరగంటపైనే ప్రీ హీట్ ఓవెన్‌లో బేక్ చేయాలి. అంతే ప్లమ్ కేక్ సిద్ధం. 

ఆరెంజ్ కేక్


కావాల్సిన పదార్థాలు: బాదం పొడి రెండు కప్పులు, గుడ్లు మూడు, తేనె సగం కప్పు, ఒక నారింజ పండు తురుము(పొట్టును తురుముకోవాలి), తాజా నారింజ రసం సగం కప్పు, బేకింగ్ పౌడర్ ఒక చెంచా. 

తయారీ విధానం: పైన చెప్పిన విధంగా ఓవెన్ లేదా గిన్నె రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్ చేయాలి. తర్వాత బాదం పొడి, తేనె, బేకింగ్ పౌడర్, నారింజపండు తురుము, నారింజ రసం వేసి కట్ అండ్ ఫోల్డ్ విధానంలో కలుపుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ మౌల్డ్‌లో పోసి.. గ్యాప్స్ లేకుండా కేక్ టిన్‌ను మెల్లగా నేలపై టాప్ చేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ కోసం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు కేక్‌ను బేక్ చేయాలి. ఓవెన్ లేని వారు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. కేక్ టిన్ చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. అంతే ఆరెంజ్ కేక్ రెడీ!

యాపిల్ కేక్..


కావాల్సిన పదార్థాలు: బాదం పొడి రెండు కప్పులు, యాపిల్ రెండు(తురుముకోవాలి), గుడ్లు మూడు, తేనె సగం కప్పు, దాల్చినచెక్క పొడి ఒక చెంచా, బేకింగ్ సోడా ఒక చెంచా. 

తయారీ విధానం: పైన చెప్పిన విధంగా ఓవెన్ లేదా గిన్నె రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్ చేయాలి. తర్వాత బాదంపొడి, యాపిల్ తురుము, తేనె, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి కట్ అండ్ ఫోల్డ్ విధానంలో కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి కొద్దిగా మైదా పిండి చల్లుకోవాలి. తర్వాత మీరు రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ మౌల్డ్‌లో పోసి.. గ్యాప్స్ లేకుండా కేక్ టిన్‌ను మెల్లగా నేలపై టాప్ చేయాలి. ఆ తర్వాత బేకింగ్ కోసం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు కేక్‌ను బేక్ చేయాలి. ఓవెన్ లేనివారు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. కేక్ టిన్ చల్లారిన తర్వాత డీ మౌల్డ్ చేసుకోవాలి. అంతే కేక్ రెడీ. 

బనానా కేక్..


కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల మైదా, చక్కెర రెండు కప్పులు, బేకింగ్ పౌడర్ ఒక చెంచా, బేకింగ్ సోడా పావు చెంచా, నూనె అరకప్పు, వెనిలా ఎసెన్స్ నాలుగు చుక్కలు, పాలు అరకప్పు. 

తయారీ విధానం: అరటి పండ్లను తొక్కతీసి ముక్కలు చేసుకోవాలి. మిక్సీజార్‌లో అరటి పండు ముక్కలు, చక్కెర, పాలు, నూనె, బేకింగ్ పౌడర్, బౌకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరటి పండు మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి మైదా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనెరాసిన గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టి నలభై నిమిషాలపాటు సన్నటి మంటపై ఉడికించుకుంటే బనానా కేక్ రెడీ అయినట్లే. ఇది హెల్దీగా, టేస్టీగా ఉంటుంది.