క్షమాపణలు చెప్పాలి
- లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య డిమాండ్
- ఆ వ్యాఖ్యలు చేసివుంటే ఉపసంహరించుకుంటాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౭: భారత్-పాకిస్థాన్ విభజనలా ఏపీ తెలంగాణ విభ జన జరిగిందని గురువారం లోక్‌సభ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు భగ్గుమన్నారు. తేజస్వి బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని శుక్రవారం లోక్‌సభ వేదికగా వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్ చేశారు. తెలంగాణపై బీజేపీ నేతలు అణువణువునా వ్యతిరేకతను నింపుకొన్నారని మండిపడ్డారు.
దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే ఉద్దేశం తేజస్వికి లేదని, ఒకవేళ అలాం టి వ్యాఖ్యలు చేసిఉంటే, వాటిని ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశా రు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని తేజస్వి సూర్య పేర్కొన్నారు. ఏపీ, విభజనను కాంగ్రెస్ విధ్వంసంగా మార్చిందని చెప్పడమే తన ఉద్దేశమని వెల్లడించారు.
త్యాగాలను అవమానించారు: ఎంపీ కడియం కావ్య
దేశ విభజన చేసినట్లు ఏపీ, తెలంగాణను విడదీశారని బీజేపీ ఎంపీ తేజ స్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయన బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ.. వందలాది మం ది యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, వారి త్యాగాలను అవ మానించేలా తేజస్వి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఏపీ తెలంగాణ విభజనను ఇండియా పాక్ విభజనతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు.
దశాబ్దాల పాటు సాగించిన పోరాటాల తర్వాతే తెలంగాణ సిద్ధించించిందని పేర్కొన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టమని తెలిసినా, పెద్ద మనసుతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు అణువణువునా తెలంగాణపై వ్యతిరేకత నింపుకొన్నారని ఆరోపించారు. తెలంగా ణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. దేశ జీడీపీలో ముఖ్యపాత్ర పోషించే దక్షిణాదికి కేంద్రం అన్యాయమే చేస్తున్నదని వ్యాఖ్యానించారు.
మహి ళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, 2023లో ఆమోదించిన బి ల్లును అమలు చేయకుండా ఆలస్యం చేయడంపై కేంద్రం సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. కులగణన చేపట్టకుంటే ఓబీ సీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.
ఆయా వర్గాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మహిళలపై ప్రేమ ఉందని చెప్పుకునే ప్రధాని మోదీ, వారిపై జరిగిన అన్యాయ ఘటనల్లో ఎందుకు స్పం దించరని నిలదీశారు. తెలంగాణ హక్కులపై ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. దేశంలోని ప్రతివర్గానికి న్యాయం జరిగేలా బిల్లు లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపసంహరించుకుంటాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణ ప్రజలను కానీ, స్వరాష్ట్ర ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం ఎంపీ తేజస్వీ సూర్యకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఒకవేళ తేజస్వి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటిని ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని వివరించారు. కాంగ్రెస్ సభ్యులు డీలిమిటేషన్‌ను తప్పబడుతున్న సమయంలో, వారిని విమర్శించే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కేవలం డీలిమిటేషన్ చర్చ నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు వివాదాన్ని పెద్దది చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీల నిరసన
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏపీ తెలంగాణ విభజనను దేశ విభజనతో పోల్చడాన్ని తప్పుబడుతూ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణకు చెందని కాంగ్రెస్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, సురేష్‌కుమార్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి, కడియం కావ్య, వేం నరేందర్‌రెడ్డి నిరసన వ్యక్తంచేశారు. తేజస్వి తెలంగాణ ఏర్పాటుపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలనూ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి పార్లమెంట్ రికార్డుల నుంచి తేజస్వి వ్యాఖ్యలను శాశ్వతంగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ రామసహాయం మాట్లాడుతూ.. ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై ద్వేషపూరితంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వ్యాఖ్యనించారు. తెలంగాణ ఏర్పాటును భారత్ విభజనకు ముడిపెట్టడం సరికాదని మండిపడ్డారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: ఎంపీ తేజస్వి
తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఎంపీల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్‌సభ వేదికగా వివరణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని విధ్వంసంగా మార్చిందని చెప్పడమే తన అభిమతమని పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం 1200 మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. తను తప్పకుండా తెలంగాణ అమరులను గౌరవిస్తానని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజల్లో లేనిపోని భయాలను సష్టిస్తున్నాయని ఆరోపించారు.






