జిల్లాలో నీట్-పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
మూడు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆగస్టు 29 (విజయ క్రాంతి): జిల్లాలో ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్-పీజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శనివారం డీసీపీ రామ్‌రెడ్డితో కలిసి పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, వైద్య సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీట్-పీజీ 2026 పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత అభ్యర్థులకు ప్రవేశం ఉండదని, అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని,
అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఒరిజినల్ పర్మినెంట్ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, దాని స్వీయ ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతిని వెంట తీసుకురావాలని తెలిపారు. అడ్మిట్ కార్డును నిర్దేశిత విధంగా ఒకే ఏ4 పేపర్‌పై కలర్‌లో రెండు వైపులా ప్రింట్ చేసుకోవాలని సూచించారు.
పటిష్ట భద్రతా చర్యలు
పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, మొబైల్ జామర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అభ్యర్థికి హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ, మాన్యువల్ బాడీ ఫ్రిస్కింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ధృవీకరణ, ఫోటో, ఎడమ బొటనవేలు ముద్ర, ఫేస్ కంపారిజన్, బార్‌కోడ్ స్కానింగ్ వంటి నిర్దేశిత ప్రక్రియలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, షూస్ వంటి నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యుత్, వైద్య సేవలు సిద్ధం చేయాలి
పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో హెల్త్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచి అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధం చేయాలని డీఎంహెచ్‌వోకు సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రశ్నపత్రం ఐదు టైమ్‌బౌండ్ సెక్షన్లుగా ఉంటుందని, ఒక్కో సెక్షన్‌కు 42 నిమిషాల సమయం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటుందని, రఫ్ షీట్, పెన్ అందించబడవని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత బయో బ్రేక్‌లకు అనుమతి ఉండదని తెలిపారు.
సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నీట్-పీజీ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని, పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్, రామగిరి తహసీల్దార్ సుమన్, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






