29 August, 2026 | 4:56 PM

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

29-08-2026 04:24 PM

బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదం

ఇద్దరు పిల్లలకు తల్లి దూరం

నర్సాపూర్ ఆగస్టు 29: బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై పట్నం లావణ్య (30) మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. లావణ్య ఇంటి పక్కనే ఉన్న పశువుల షెడ్డులో బట్టలు ఆరవేస్తుండగా ఇనుప దండెంకు విద్యుత్ వైరు తగిలి ఉండటాన్ని గమనించలేదు.

దండెంను తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెను కాపాడే అవకాశం లేకపోయింది. మృతురాలికి 12 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. లావణ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.