29 August, 2026 | 4:43 PM

తూంకుంటలో గంజాయి చాక్లెట్ల దందా గుట్టురట్టు

29-08-2026 04:12 PM

శామీర్‌పేట్, ఆగస్టు 29 ( విజయ క్రాంతి): తూంకుంట చంద్రారెడ్డి కాలనీలో గంజాయి చాక్లెట్ల దందాను శామీర్‌పేట్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఓ ఇంటిపై దాడి చేసి బీహార్‌కు చెందిన బైద్‌నాథ్ కుమార్‌ (29)ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 5,298 గంజాయి చాక్లెట్లు, మొత్తం 24.59 కిలోలు, స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివో మొబైల్‌ ఫోన్‌, రూ.1,760 నగదు, సూట్‌కేస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాన్‌షాప్‌ ముసుగులో బీహార్‌ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి తూంకుంటలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి భార్య పూజా కుమారి పరారీలో ఉండగా, ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.