సత్తా చూపిస్తాడా ?
సర్ఫరాజ్‌కు రెండో ఛాన్స్
రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ
దేశవాళీ క్రికెట్‌లో సూపర్ ఫామ్
మరింత ఫిట్‌గా యువ క్రికెటర్
భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు రెండో ఛాన్స్ దక్కింది. దాదాపు రెండేళ్ల తర్వాత సెలక్టర్లు పిలుపునివ్వడంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. సాయి సుదర్శన్ స్థానంలో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా ? దేశవాళీ క్రికెట్ ఫామ్ కొనసాగిస్తాడా ?
కొలంబో, ఆగస్టు 10 : భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమే దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ప్రతీ అవకాశంలోనూ అంచనాలకు తగ్గట్టు రా ణించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ స్థానానికి కనీసం నలుగురు పోటీలో ఉంటున్నారు.
దీంతో వరుస అవకాశాల్లో విఫలమైతే మాత్రం వేటు పడడం ఖాయం. తాజాగా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ఇలాంటి చర్చే నడుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ లంకతో సిరీస్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన కొత్తలో బాగానే ఆడాడు. ఆరు టెస్టుల్లో నిలకడగానే రాణించినా ఫిట్ నెస్ వల్ల కొన్ని ఇ బ్బందులు ఎదుర్కొన్నాడు. 2024లో న్యూ జిలాండ్‌తో సిరీస్ ఆడినప్పుడు అంతగా రాణించలేదు.
అప్పుడే అతన్ని తప్పించారు. నిజానికి కివీస్‌పై కీలక బ్యాటర్లు సైతం విఫలమైనా కూడా సర్ఫరాజ్ పైనే వేటు పడిం ది. ఒకవేళ బరువు ఎక్కువ ఉండడంతో ప క్కన పెట్టారన్న అనుమానాలు కూడా వచ్చా యి. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై సర్ఫరాజ్ బాగా ఫోకస్ పెట్టాడు. గడిచిన 18 నెలల్లో అతను సుమారు 17 కేజీల బరువు తగ్గాడు. ఒకప్పటి రూపానికి భిన్నంగా పూర్తిగా స్లిమ్ అయిపోయాడు. మరింత ఫిట్‌గా మారడం అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచింది.
ఇటీవల ముంబై టీ20 లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆకాశ్ టైగర్స్ వెస్ట్రన్ ముంబై తరపున అతను ఆ టోర్నీలో ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత తన ప్రాక్టీస్‌ను కశ్మీర్‌కు మార్చేశాడు. అక్కడ నెట్ బౌలర్లతో ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలోనే నేను ఫిట్ లేకపోవచ్చు, కానీ అన్ని రకాలుగా పోరాడుతాను అని సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. జాతీయ జట్టులో చోటు కోసమే ఇలాంటి పోస్ట్ పెట్టాడా అన్న చర్చ కూడా నడిచింది. అదే సమయంలో సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు.
దీంతో అతని స్థానంలో లంకతో సిరీస్ కోసం సర్ఫరాజ్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీ ద్ పేర్లు చర్చకు వచ్చాయి. కానీ గిల్, పంత్ తర్వాత స్పిన్ను బాగా ఆడే బ్యాటర్‌గా సర్ఫరాజ్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. జురెల్ కంటే కూడా మెరుగ్గా ఆడతాడన్న అంచనాలతో ఎంపిక చేశారు. అయితే శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీతో రాణించాడు. అతన్నే మూడో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. మరి సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ అవకాశం దక్కితే మాత్రం సర్ఫరాజ్ దానిని ఒడిసిపట్టుకుంటే మాత్రం జట్టులో కొనసాగే అవకాశముంటుంది.






