24 May, 2026 | 4:58 PM

విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

24-05-2026 03:43 PM

కల్వకుర్తి: విద్యుత్ తీగలను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు  షాక్ తగలడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వడ్డే శివ (30) వ్యవసాయం లేకపోవడంతో కౌలుకు భూమి తీసుకొని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదనంగా వడ్డెర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామ శివారులోని బండపై రాయి కొట్టేందుకు వెళ్లిన సమయంలో అక్కడ విద్యుత్ తీగ తెగిపోవడంతో దానిని సరిచేయడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో గాలులు బలంగా వీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ చేతికి తగలడంతో  షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో కొంతసేపటి తర్వాత పక్కనే ఉన్న రైతు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడు కొన్నేళ్ల  ప్రేమ వివాహం చేసుకొని ముకురాల గ్రామంలో స్థిరపడ్డాడు. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాదాన్ని నింపాయి.