06-02-2026 12:05:52 AM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 5, (విజయక్రాంతి): నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని జీవితంలో స్థిర పడటానికి ఉన్న ఊరిలోనే కాకుండా తప్పనిసరిగా బయట ప్రపంచంలో అడుగులు వేస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ యువతీ యువకులకు సూచించారు. గురువారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, డ్రోన్ సర్వీస్ ఎలక్ట్రీషియన్ శిక్షణ పొందుతున్న గిరిజన యువతి యువకులు శిక్షణ పూర్తవుతున్న సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో గిరిజనులకు అందిస్తున్న సేవల గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా అన్ని విభాగాలు తిరిగి వివరాలు సేకరించి ఐటీడీఏ పీవోను తన ఛాంబర్ లో కలిసి విభాగాలకు సంబంధించిన పలు వివరాలు తీసుకుంటున్న మూడు కోర్సుల శిక్షణకు సంబంధించిన అంశాలు పిఓకి వివరించారు.
ఈ సందర్భంగా ఆయన యువతీ యువకులకు పలు సూచనలు ఇస్తూ, డ్రోన్ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్, రిసెప్షన్ నిస్ట్ అసోసియేషన్ శిక్షణ తీసుకుంటున్న యువతి,యువకులు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఇంగ్లీషులోనే మాట్లాడాలని, శిక్షణ తీసుకునేటప్పుడే ఒకరికి ఒకరు తప్పులు ఉన్న ఇంగ్లీషులోనే మాట్లాడుకొని తప్పులు సరిదిద్దుకోవాలని, ఇలా మాట్లాడడం వలన వ్యక్తిగతంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని అన్నారు.
ఐటీడీఏలో ఉన్న విభాగాలు గిరిజన సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయని, ముఖ్యంగా విద్యా, వైద్యం, గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, గిరిజన రైతులకు వ్యవసాయంలో మెలకువలు మరియు వారికి సబ్సిడీ ద్వారా కరెంటు, బోరు మోటర్లు, నిరుద్యోగ యువతీ యువకులకు పలు శిక్షణలు అందించి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, గిరిజన విద్యార్థుల పై చదువులకు ఆర్థిక సహాయం, మారుమూల ప్రాంతం గిరిజనులకు వైద్యం పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
60 రోజులపాటు శిక్షణ తీసుకున్న యువతీ యువకులు తప్పనిసరిగా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి అనుకున్న ఉద్యోగం వచ్చేవరకు కుటుంబాలను పోషించుకోవాలని, అలాగే మీరు నేర్చుకున్నది పదిమంది గిరిజన యువతి యువకులకు తెలిసే విధంగా చేసి వారు కూడా ఇటువంటి శిక్షణలు తీసుకొని ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, వివిధ కోర్సుల శిక్షకులు శ్రీనివాస్, అరుణ, సులోచన, అబ్దుల్, భవాని, అనూహ్య, వినీత, సమ్మయ్య యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.